‘2.0’ ప్రియులకు చిన్న షాక్

‘2.0’ ప్రియులకు చిన్న షాక్

‘2.0’ సినిమాతో భారతీయ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచాలన్న కృత నిశ్చయంతో మూడేళ్లుగా కష్టపడుతున్నాడు శంకర్. ‘రోబో’ సినిమాతో ఇండియన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌ను కొత్త పుంతలు తొక్కించాడు శంకర్.

ఐతే ‘2.0’ తీసేలోపు రాజమౌళి లాంటి దర్శకులు వీఎఫెక్స్ ప్రమాణాల్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని ‘2.0’ కోసం మరింతగా శ్రమించాడు శంకర్. అతడి కష్టమేంటో మొన్న రిలీజైన వీఎఫెక్స్ మేకింగ్ వీడియోతోనే అర్థమైంది. ‘2.0’లో వీఎఫెక్స్ కళ్లు చెదిరే రీతిలో ఉంటాయని స్పష్టమైంది. ఐతే ఇలాంటి ఎఫెక్ట్స్‌ను త్రీడీలో చూస్తే మరింత గొప్పగా అనిపిస్తాయని.. ఆ అనుభూతే వేరుగా ఉంటుందని శంకర్ అండ్ కో భావించింది.

అందుకే హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో.. సరికొత్త టెక్నాలజీతో ఈ చిత్రాన్ని త్రీడీలోనూ చిత్రీకరించింది. కానీ దృశ్యాల్ని త్రీడీ రూపంలోకి మలచడంలో మాత్రం ఆశించిన ఔట్ పుట్ రాలేదని సమాచారం. ఓ హాలీవుడ్ స్టూడియోకు ఈ బాధ్యతలు అప్పగించగా.. వాళ్లు సరైన ఔట్ పుట్ ఇవ్వలేదట. నిజానికి విజువల్ ఎఫెక్టుల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఐతే సినిమా ఆలస్యమైనా పర్వాలేదని.. క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు శంకర్. ఇప్పుడు త్రీడీ ఎఫెక్టుల విషయంలోనూ ఇలాగే జరిగేసరికి ఏం చేయాలో పాలుపోవట్లేదట.

సినిమా ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో త్రీడీ కోసం ఇంకా లేట్ చేస్తే జనాల్లో సినిమాపై ఆసక్తి చచ్చిపోతుందని.. కాబట్టి త్రీడీ లేకుండానే సినిమాను రిలీజ్ చేసేద్దామన్న నిర్ణయానికి శంకర్, నిర్మాతలు వచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే ప్రేక్షకులకు ఒకింత నిరాశ తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు