శ్రీ‌దేవితో వ‌ర్మ ఫ‌స్ట్ మీటింగ్ అలా

శ్రీ‌దేవితో వ‌ర్మ ఫ‌స్ట్ మీటింగ్ అలా

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవిని వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఎంతలా అభిమానించి.. ఆరాధిస్తారో తెలియంది కాదు. కాలేజీ రోజుల నుంచి తాను అమితంగా ఆరాధించిన శ్రీ‌దేవితో ఆయ‌న క్ష‌ణ‌క్ష‌ణం చిత్రాన్ని తీశారు. శ్రీ‌దేవి మీద త‌న‌కున్న ఆరాధ‌నా భావాన్ని గ‌తంలో ప‌లుమార్లు చెప్పుకున్న వ‌ర్మ‌.. తాజాగా ఆమె మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆమెతో త‌న గురుతుల్ని సుదీర్ఘంగా చెప్పుకున్నారు.

సోష‌ల్ మీడియాలో శ్రీ‌దేవితో త‌న‌కున్న ఆరాధ‌న‌ను పేర్కొన్న ఆయ‌న‌.. తాను చూసిన శ్రీ‌దేవి తొలిసినిమాను..ద‌ర్శ‌కుడ‌య్యాక ఆమె ఇంటి ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏం చేశాన‌న్న విష‌యంతో పాటు.. శ్రీ‌దేవితో త‌న మొద‌టి మీటింగ్ ఎలా సాగింద‌న్న వివ‌రాల్ని వెల్ల‌డించారు.

శ్రీ‌దేవితో తాను తీసిన క్ష‌ణ‌క్ష‌ణం సినిమాతో ఆమెను తాను ఎంత‌గా ఇంప్రెస్ చేయాల‌ని అనుకున్నానో చెప్ప‌టంతో పాటు.. ఆ సినిమా షూటింగ్ క్లైమాక్స్ షూటింగ్ విశేషాల్ని గుర్తు చేసుకున్నారు. శ్రీ‌దేవి మ‌ర‌ణంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన వ‌ర్మ‌.. శ్రీ‌దేవి గురించి ఫేస్ బుక్ లో ఆయ‌న పోస్ట్ లోని కొన్ని ఆస‌క్తిక‌ర అంశాల్ని చూస్తే..

శ్రీ‌దేవి న‌టించిన సినిమాలో నేను చూసిన మొద‌టి సినిమా ప‌ద‌హారేళ్ల వ‌య‌సు. ఆ సినిమాలో శ్రీ‌దేవి అందం న‌న్ను అమితంగా ఆక‌ర్షించింది. ఆమెను విజ‌య‌వాడ‌లోని ఆ సినిమా ఆడుతున్న థియేట‌ర్ కు వెళ్లేవాడ్ని. మాన‌వ రూపంలో దిగి వ‌చ్చిన దేవ‌త‌గా అనిపించేది. అప్ప‌టి నుంచి ఆమె న‌టించిన ప్ర‌తిసినిమాను ఫాలో అవుతూ వ‌చ్చా.

ఆమెను చూసినంత‌సేపు వేరే లోకంలో విహ‌రిస్తున్న‌ట్లుగా ఉండేది. ద‌ర్శ‌కుడిగా శివ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే టైంలో చెన్నైలోని హీరో నాగార్జునఆఫీసుకు న‌డుచుకుంటూ వెళ్లేవాడిని. వాళ్ల ఆఫీసు శ్రీ‌దేవి ఇంటికి ద‌గ్గ‌ర‌గా ఉండేది.

ప్ర‌తిసారి చెన్నైలోని శ్రీ‌దేవి ఇంటి ముందు ఆగి.. ఆ ఇంటిని ఆస‌క్తిగా చూసేవాడ్ని. ఆ ఇల్లు చెత్త‌గా అనిపించేది. ఎందుకంటే.. అతిలోక సుంద‌రి అయిన శ్రీ‌దేవి అలాంటి ఇంట్లో ఉండ‌టం ఏమిట‌నిపించేది. ఆమె ఎప్పుడైనా క‌నిపిస్తుందా అని చూస్తుండేవాడిని. కానీ.. ఎప్పుడూ క‌నిపించ‌లేదు.

శివ చిత్రం విడుద‌లై స‌క్సెస్ అయ్యాక ఒక నిర్మాత నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. మీకు శ్రీ‌దేవితో సినిమా చేయాల‌ని ఉందా? అని అడిగారు. అందుకు తాను.. మీకేమైనా పిచ్చా.. నేను ఆమెను చూసేందుకే ప‌డి చ‌స్తున్నా.. ఆమెతో సినిమా చేయాటం.. ఆమెను ద‌గ్గ‌ర‌గా చూడ‌ట‌మా? అని ఎక్సైట్ అయిపోయా. ఆమెతో సినిమా చ‌ర్చ కోసం ఆమె ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేశారు.

అంత‌కు ముందు ఎన్నోసార్లు గేటు బ‌య‌ట ఆమె కోసం ఎంతో ఆశ‌గా ఎదురుచూసిన నాకు.. ఆ రోజు ఏకంగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టే అవ‌కాశం రావ‌టంతో ఎంతో ఎక్సైట్ అయి ఉన్నా. నిర్మాత‌తో క‌లిసి ఆమె ఇంటికి వెళ్లా. అప్పుడు క‌రెంట్ పోయింది. క్యాండిల్ వెలిగించారు. ఆమె రాక కోసం.. ఆమెను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు ఎంతో అతృత‌గా ఉన్నా. ఆ చీక‌ట్లో అతిలోక సుంద‌రిలా వెలిగిపోతూ ఆమె వ‌స్తున్న దృశ్యాన్ని ఊహించుకుంటూ ఉన్నా.

అయితే.. ఆ రోజు ఆమె ఫైట్ జ‌ర్నీ కోసం ఏర్పాట్ల హ‌డావుడిలో ఉన్నారు. ఇంట్లోని ఒక గ‌దిలో నుంచి మ‌రో గ‌దిలోకి హ‌డావుడిగా తిరుగుతున్నారు. ప్ర‌యాణానికి సంబంధించిన ప్యాకేజ్ రెఢీ చేసుకుంటున్నారు. అలా ఒక గ‌దిలో నుంచి మ‌రో గ‌దిలోకి తిరుగుతున్న ప్ర‌తిసారీ ఒక మెరుపు మెరిసిన‌ట్లుగా అనిపించేది. చివ‌ర‌కు నేనెంతో కాలంగా ఎదురు చూస్తున్న క్ష‌ణం వ‌చ్చేసింది. ఆమె అలా రావ‌టం.. తన జ‌ర్నీకి టైం అవుతుంద‌ని.. ఎక్కువ‌సేపు ఉండ‌లేక‌పోతున్నందుకు సారీ చెప్పి.. సినిమాకు ఓకే చెప్పేసి వెళ్లిపోయింది. క్యాండిల్ లైట్లో ఆమెతో మీటింగ్ నేనెప్ప‌టికీ మ‌ర్చిపోలేను.

ఆ త‌ర్వాత శ్రీ‌దేవి త‌ల్లితో చాలాసేపు మాట్లాడుతూ ఉండిపోయాను. ఎందుకంటే.. ఆమె శ్రీ‌దేవిని క‌న్న‌వ్య‌క్తి. అందుకే.. ఆమెతో ఎంతో గౌర‌వంగా మాట్లాడా. ఆ రోజు రాత్రి శ్రీ‌దేవిని ఇంప్రెస్ చేయ‌టానికి క్ష‌ణ‌క్ష‌ణం రాయ‌టం మొద‌లుపెట్టా. ఆ సినిమాను ఆమెకు నేనురాసిన ల‌వ్ లెట‌ర్ గా భావిస్తా. క్ష‌ణ‌క్ష‌ణం సినిమాతో ఆమెను నేను అర్థం చేసుకోవ‌టానికి ఉప‌యోగ‌ప‌డింది. యాక్టింగ్ లో ఆమె అనుస‌రించే విధానాల్ని గ్ర‌హించా.. త‌ర్వాత కాలంలో డైరెక్ట‌ర్ గా నా ఎదుగుద‌ల‌కు అదెంతో సాయం చేసింది.

క్ష‌ణ‌క్ష‌ణం సినిమా క్లైమాక్స్ ను నంద్యాల‌లో షూట్ చేశాం. ఆ రోజు నంద్యాల మొత్తం బంద్‌. నంద్యాల‌లోని బ్యాంకులు.. ప్ర‌భుత్వ ఆఫీసులు.. స్కూళ్లు అన్నీ బంద్ అయ్యాయి. కార‌ణం శ్రీ‌దేవి ఊరికి రావ‌టం. ఆమెను చూసేందుకు జ‌నం విర‌గ‌బ‌డి వ‌చ్చారు. ఆమెనుచూడాల‌ని త‌హ‌త‌హ‌లాడిపోయారు. జ‌నాల్ని అదుపు చేసేందుకు పోలీస్ ఫోర్స్ ను ఉప‌యోగించాల్సి వ‌చ్చింది. అంత‌టి స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తిని ఇప్ప‌టివ‌ర‌కూ నేను చూడ‌లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English