కళ్యాణ్ రామ్ ఆగట్లేదసలు

కళ్యాణ్ రామ్ ఆగట్లేదసలు

నందమూరి కళ్యాణ్ రామ్ చివరి సినిమా ‘ఇజం’ డిజాస్టర్. అంతకుముందు వచ్చిన ‘షేర్’కు కూడా ఇలాంటి ఫలితమే వచ్చింది. అయినప్పటికీ అతడికి అవకాశాలకేమీ కొదవలేదు. ఇంతకుముందులా అతను సొంత బేనర్లో కూడా సినిమాలు చేయట్లేదు. బయటి బేనర్లలోనే వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘180’ ఫేమ్ జయేంద్ర దర్శకత్వంలో ‘నా నువ్వే’తో పాటు ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడితో ‘ఎమ్మెల్యే’ అనే సినిమాలోనూ కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా కళ్యాణ్ రామ్ మరో కొత్త సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. విజయ్ మద్దాల అనే కొత్త దర్శకుడు రూపొందించబోయే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తాడట. ‘ఎమ్మెల్యే’ సినిమాను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్లే ఈ చిత్రాన్ని కూడా టేకప్ చేయనున్నారట. సీనియర్ రైటర్ కోన వెంకట్ ఈ చిత్రానికి రచనా సహకారం అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ ఉంటాడట.

మరోవైపు మలయాళంలో సూపర్ హిట్టయిన ‘రామ్ లీలా’ రీమేక్ ప్రపోజల్ కళ్యాణ్ రామ్ దగ్గరే ఉంది. ఇది కాక మల్టీ డైమన్షన్ పిక్చర్స్ సంస్థలోనూ కళ్యాణ్ రామ్ ఒక సినిమా చేయబోతున్నాడు. మొత్తానికి ఇంతకుముందు సొంత బేనర్‌కే పరిమితమైన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న సమయంలో ఇలా వరుస బెట్టి బయటి బేనర్లలో అవకాశాలు అందుకుంటుండటం విశేషమే. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమాల్లో ముందుగా ‘ఎమ్మెల్యే’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. అది మార్చి నెలాఖర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు