టాయిలెట్ కట్టేసిన త్రిష

టాయిలెట్ కట్టేసిన త్రిష

ఎంతో మంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు. కానీ కొంత మంది హీరోయిన్స్ మాత్రం ఏళ్లు గడుస్తున్నా ఇంకా మంచి అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం వస్తోన్న కుర్ర హీరోయిన్స్  అందంలో గట్టి పోటీని ఇస్తున్నారు. అలాంటి వారిలో త్రిష ఒకరు. అమ్మడు సినీ రంగంలోకి వచ్చి దాదాపు పదిహేనేళ్లు పూర్తికావొస్తోంది. వయసు కూడా మూడు పదులు దాటింది. కానీ త్రిష కెరీర్ ను ఒక లెవెల్లో సెట్ చేసుకుంటూ వెళుతోంది.

ఇకపోతే సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని మనసున్న మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇటీవల త్రిష UNICEF కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయిన సంగతి తెలిసిందే. అయితే సంస్థ తో త్రిష పలు సామాజిక కార్యక్రమాల్లో మొదటి అడుగు వేస్తోంది. ఇటీవల చెన్నై లోని కాంచీపురం జిల్లా నేమ్మెలి గ్రామంలో పారిశుధ్యం అవగాహన సృష్టిలో భాగంగా ప్రతి ఇంటికి టాయిలెట్ అవసరమని వాటి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంది. అంతే కాకుండా అక్కడ త్రిష ఇటుకలు పేర్చి సిమెంట్ కూడా వేసింది.

దీంతో త్రిష చేసిన పనికి అందరు చప్పట్లను కొట్టి ఈలలు వేశారు. తనను కలవడానికి వచ్చిన చాలా మంది గ్రామాస్తులని త్రిష ఎంతో ఆప్యాయంగా పలకరించింది. కొంతమందికి సెల్ఫీలను కూడా ఇచ్చింది.  ఇక పరిశుభ్రత గురించి తనకు తెలిసిన ముఖ్యమైన విషయాలను అందరికి తెలిపింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష ప్రస్తుతం తమిళ్ - మలయాళం సినిమాలలో  నటిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు