ఈ కలక్షన్లు సరిపోవు మరి

ఈ కలక్షన్లు సరిపోవు మరి

రాజశేఖర్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ సందడి బలంగా జరుగుతోన్న 'పిఎస్‌వి గరుడవేగ' నిజంగా మంచి చిత్రమే కానీ రాజశేఖర్‌ రేంజ్‌కి ఖర్చు చాలా ఎక్కువ పెట్టేసారు. అంత ఖర్చు పెట్టినపుడు రిలీజ్‌ అయినా సరిగ్గా ప్లాన్‌ చేసుకోవాలి. కానీ ఈ చిత్రానికి సరిపడా థియేటర్లు దొరకలేదు. దీంతో మొదటి వారాంతంలో ఎంత మంచి టాక్‌ వున్నా కానీ ఎక్కువగా క్యాష్‌ చేసుకోలేకపోయింది.

ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు సరిపోవని ట్రేడ్‌ అంటోంది. ఈమధ్య కాలంలో వచ్చిన మీడియం రేంజ్‌ సినిమాలకి మొదటి రోజు వచ్చిన వసూళ్లు గరుడవేగకి మూడు రోజుల్లో వచ్చాయి. ప్రస్తుతం ఏ సినిమాకి అయినా మొదటి వారాంతం చాలా కీలకం. ఫస్ట్‌ వీకెండ్‌లో వచ్చే వసూళ్లలో సగం కూడా మిగతా రన్‌లో రావడం లేదు. గరుడవేగ టాక్‌ బాగుంది కనుక ఫస్ట్‌ వీకెండ్‌ వసూళ్లకి రెండింతలు మిగతా రన్‌లో వస్తాయని అనుకున్నా కానీ ఈ చిత్రానికి అయిన ఖర్చుకి అవి సరిపోవు.

డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల రూపంలో ఎక్కువ వస్తాయని ఆశించాలి. అలాగే రీమేక్‌ రైట్స్‌ రూపంలో కొన్ని కోట్లు వస్తే గట్టెక్కవచ్చు. అందరూ మర్చిపోయిన రాజశేఖర్‌ మళ్లీ ఈ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అలాగే దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు సత్తా వున్నవాడేనని నిరూపించుకున్నాడు.

కమర్షియల్‌గా కూడా ఈ చిత్రం నిర్మాతలకి వర్కవుట్‌ అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇలాంటి సినిమాలు తీసే వారు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ చిత్రం ఇంకోసారి గట్టిగా చెబుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు