ఒక్కో జోనర్ లో ఒక్కోటి.. బాగుందమ్మా!!

ఒక్కో జోనర్ లో ఒక్కోటి.. బాగుందమ్మా!!

ప్రస్తుతం దర్శకులు అంతా తమకు బాగా స్ట్రెంగ్త్ ఉన్న జోనర్ కు కట్టుబడిపోతున్నారు. తాము ఏ విషయాన్ని అయితే పక్కాగా డీల్ చేయగలమో.. అదే సబ్జెక్ట్ తో హీరోలను మార్చి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కానీ కుర్ర డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మాత్రం.. ఇప్పటివరకూ 5 సినిమాలు తెరకెక్కించగా.. వేటికవే ప్రత్యేకమైన జోనర్ లోవి కావడం విశేషం.

యూఎస్ లో ఆరంకెల జీతం అందుకునే ఉద్యోగాన్ని వదులుకుని ఇండియా వచ్చి తన సినిమా ప్యాషన్ ను నిరూపించుకుంటున్నాడు ఈ దర్శకుడు. మొదటగా ఎల్‌బీడబ్ల్యూ అంటూ రొమాంటిక్ డ్రామా .. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ అంటూ రొమాంటిక్ కామెడీ తీశాడు. మొదటి సినిమాకి కేవలం ఎల్‌బీడబ్ల్యూ అన్న ఇంగ్లీష్ అక్షరాలతో చేసిన ప్రచారం ఆకట్టుకోలేకపోయింది. కానీ రెండో సినిమా భారీ సక్సెస్ కాకపోయినా.. పెట్టుబడి కంటే మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. తర్వాత చందమామ కథలు అంటూ సోషల్ డ్రామా తీసి.. నేషనల్ అవార్డ్ కూడా పట్టేసి.. వేర్వేరు చిన్న కథలను క్లైమాక్స్ లో మిక్స్ చేసిన స్క్రీన్ ప్లేకు బోలెడన్ని ప్రశంసలు అందుకున్నాడు. అయితే.. సక్సెస్ మాత్రం అందలేదనే కసితో.. అడల్ట్ కామెడీ జోనర్ లో కంటెంట్ ఉన్న మూవీగా గుంటూరు టాకీస్ ను తెరకెక్కించి.. మాంచి సక్సెస్ టేస్ట్ చేశాడు.

ఇప్పుడు పీఎస్వీ గరుడవేగ అంటూ స్పై థ్రిల్లర్ రూపొందించి ఆశ్చర్యపరిచాడు. టాలీవుడ్ స్క్రీన్ పై ఇంతగా నరాలు తెగే ఉత్కంఠతో ఓ స్పై థ్రిల్లర్ మూవీని చూడ్డం ఇదే మొదటిసారి అనే ప్రశంసలు వస్తున్నాయంటే.. ప్రవీణ్ సత్తా ఏంటో అర్ధమవుతుంది. బాగుందమ్మా.. ఇప్పుడు ఈ దర్శకుడు తర్వాత ఏ జోనర్ లో మూవీ తీస్తాడనే ఆసక్తి కనిపిస్తోంది.  అయితే పుళ్ళెల గోపిచంద్ బయోపిక్ ను సుధీర్ బాబు హీరోగా బయోపిక్ జానర్ లో సినిమా తీస్తాడనే టాక్ ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు