నారా రోహిత్‌తో క్లోజ్ ఫ్రెండ్ ఫైట్

నారా రోహిత్‌తో క్లోజ్ ఫ్రెండ్ ఫైట్

నారా రోహిత్‌కు ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే మరో మాట లేకుండా శ్రీ విష్ణు పేరు చెప్పేస్తారు. వీళ్లిద్దరికీ దశాబ్దానికి పైగా స్నేహం ఉంది. శ్రీవిష్ణు కోసం నారా రోహిత్ చాలానే చేశాడు. తన సినిమాల్లో మంచి మంచి పాత్రలిచ్చాడు. అతడిని హీరోగా పెట్టి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే సినిమాను కూడా నిర్మించాడు.

ఇప్పుడు కూడా వీళ్లిద్దరూ కలిసి ‘వీరభోగ వసంతరాయలు’ అనే సినిమా చేస్తున్నారు. రోహిత్, విష్ణు ఇద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. తమ స్నేహం గురించి ఎగ్జైట్మెంట్‌తో మాట్లాడుతుంటారు. అంత మంచి స్నేహితులైన వీళ్లిద్దరూ బాక్సాఫీస్ సమరానికి దిగబోతుండటం విశేషం.

ఈ నెల 24న నారా రోహిత్, శ్రీవిష్ణు సినిమాలు పోటీ పడబోతున్నాయి. ముందుగా నారా రోహిత్ తన కొత్త సినిమా ‘బాలకృష్ణుడు’ను 24న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అది తెలిసి కూడా శ్రీవిష్ణు సినిమా ‘మెంటల్ మదిలో’ను అదే రోజుకు షెడ్యూల్ చేయడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా శ్రీవిష్ణునే ట్విట్టర్లో ప్రకటించాడు.

మరి తన కోసం ఎంతో చేసిన స్నేహితుడి సినిమా లైన్లో ఉందని తెలిసి కూడా శ్రీవిష్ణు తన సినిమాను రిలీజ్ చేయడానికి ఎలా ఒప్పుకున్నాడో మరి. నిజానికి ఈ రెండు సినిమాల్లో ఎక్కువ పాజిటివ్ బజ్ ఉన్నది ‘మెంటల్ మదిలో’కే. అది భిన్నమైన సినిమాలా కనిపిస్తోంది. పైగా ఈ చిత్రాన్ని సురేష్ బాబు టేకప్ చేశాడు. మరోవైపు ‘బాలకృష్ణుడు’ ఏమో మామూలు మసాలా సినిమాలా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు.. తన ఫ్రెండుకు గట్టి పంచ్ ఇస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English