తమన్నా రేంజ్ మరీ తగ్గించేశారే..

తమన్నా రేంజ్ మరీ తగ్గించేశారే..

చర్చోపచర్చలు.. అనేక మార్పులు చేర్పుల తర్వాత ‘క్వీన్’ తెలుగు రీమేక్ ఎట్టకేలకు ఈ మధ్యే కన్ఫమ్ అయింది. తమన్నా కథానాయికగా నీలకంఠ దర్శకత్వంలో మను కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యాడు. ఈ మధ్యే ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. తెలుగులోనూ ‘క్వీన్’ అనే పేరుతోనే ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

కాగా ఈ చిత్రంలో తమన్నాకు జోడీగా ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు ఎంపికయ్యాడు. ఈ చిత్రంలో సిద్ధుది పూర్తి స్థాయి పాత్రేమీ కాదు. సినిమా ఆరంభంలో కాసేపు.. చివర్లో కాసేపు కనిపించే పాత్ర ఇది. అయినప్పటికీ తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ సరసకు సిద్ధు లాంటి చిన్న స్థాయి నటుడిని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. హిందీలో కంగనాకు జోడీగా ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు ఈ పాత్రలో కనిపించాడు. అతను కథానాయికను పెళ్లిచేసుకోబోయేవాడిగా కనిపిస్తాడు.

మరోవైపు ‘క్వీన్’ రీమేక్ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి తెరకెక్కుతోంది. తమిళంలో కాజల్ కథానాయిక. నీలకంఠనే దర్శకుడు. కన్నడ, మలయాళ వెర్షన్లకు రమేష్ అరవింద్ దర్శకుడు. కన్నడలో పారుల్ యాదవల్.. మలయాళంలో మాంజిమా మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ నాలుగు భాషలకూ త్యాగరాజన్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తాడు. ‘క్వీన్’ రీమేక్ హక్కులు అతడి దగ్గరే ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు