నాలుగు కోట్లు కట్టి మోసపోయిన జగపతిబాబు?

నాలుగు కోట్లు కట్టి మోసపోయిన జగపతిబాబు?

సీనియర్ నటుడు జగపతిబాబు రోడ్డెక్కాడు. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వల్ల మోసపోయానంటూ ఆయన ఆరోపించారు. ఆయనతో పాటు హైదరాబాద్‌కు చెందిన పలువురు వీఐపీలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘లోధా’ చీట్ చేసిందంటూ నిరసన తెలిపారు.

మెట్రో నగరాల్లో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ సంస్థగా ఉన్న ‘లోధా’ హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కట్టిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర రూ.4 కోట్లు వసూలు చేసిందట. 10.5 ఎకరాల భారీ స్థలంలో పూర్తి ప్రైవసీతో, అత్యాధునిక సౌకర్యాలతో, భద్రత ఏర్పాట్లతో ఈ అపార్ట్‌మెంట్ కడతామని చెప్పిందట.

కానీ ఆ మాట తప్పి కేవలం మూడు ఎకరాల్లో మాత్రమే అపార్ట్‌మెంట్ నిర్మాణం మొదలుపెట్టిందని.. దీంతో పాటుగా పక్కనే నిర్మిస్తున్న మామూలు అపార్ట్‌మెంట్‌ను ఈ కంపౌండ్‌లోకే కలిపిస్తోందని.. దీంతో తమ ప్రైవసీ, భద్రత మాటేంటని.. మామూలు అపార్ట్‌మెంట్లతో కలిపేట్లయితే.. ఇంత తక్కువ స్థలంలో అపార్ట్‌మెంట్ కట్టేట్లయితే రూ.4 కోట్లు ఎందుకు పెడతామని జగపతిబాబు ప్రశ్నించారు.

జీహెచ్ఎంసీ నిబంధనల్ని కూడా ఉల్లంఘించి అపార్ట్‌మెంట్ కడుతున్నారని.. ప్రహరీ గోడ నిర్మాణంలోనూ అక్రమాలున్నాయని తమకు తెలిసిందని.. దీంతో తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని.. ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు జోక్యం చేసుకోవాలని జగపతిబాబు కోరారు. తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని తేలిగ్గా వదిలపెట్టబోమన్నారు. జగపతిబాబుతో పాటు డబ్బులు కట్టిన పలువురు వీఐపీలు ఈ అపార్ట్‌మెంట్ దగ్గరికొచ్చి నిరసన వ్యక్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు