‘సాహో’పై అంచనాలు పెంచేస్తున్నాడే...

‘సాహో’పై అంచనాలు పెంచేస్తున్నాడే...

ప్రభాస్ తన కొత్త సినిమా ‘సాహో’ గురించి ఇప్పటిదాకా ఏమీ మాట్లాడలేదు. ఆ చిత్ర దర్శకుడు సుజీత్ కూడా దీని గురించి ఇప్పటిదాకా ఏ ముచ్చట్లూ చెప్పింది లేదు. చిత్ర నిర్మాణ సంస్థ ‘యువి’ క్రియేషన్స్ కూడా సైలెంటుగానే ఉంది. కానీ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించబోతున్న నీల్ నితిన్ ముఖేష్ మాత్రం ‘సాహో’ గురించి ఓ రేంజిలో చెబుతున్నాడు.

ఈ సినిమా ఒప్పుకున్న నాటి నుంచి నీల్ నితిన్ చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాడు. ఇప్పటిదాకా తాను చాలా యాక్షన్ సినిమాలు చేశానని.. కానీ అవన్నీ ఒకెత్తు, ‘సాహో’ మరో ఎత్తు అని.. దీని కోసం తాను చాలా ట్రైన్ కావాల్సి వచ్చిందని నీల్ నితిన్ ఇంతకుముందే వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘సాహో’ గురించి మరోసారి అతను స్పందించాడు.

‘సాహో’ కథ వినిపించేందుకు సుజీత్ వచ్చినపుడు.. అతడి విజన్ ఎలాంటిదో తనకు అర్థమైందని నీల్ నితిన్ తెలిపాడు. కథ వింటున్నపుడే తాను ఈ సినిమా చేయబోతున్నాననే విషయం అర్థమైపోయిందని చెప్పాడు. సుజీత్‌కు తాను తీయబోయే సినిమా మీద చాలా క్లారిటీ ఉందన్నాడు. ‘సాహో’ అంచనాల్ని మించి ఉంటుందని నీల్ అన్నాడు. ఈ చిత్రంలో తీసుకొచ్చిన టెక్నీషియన్లను చూస్తేనే.. యాక్షన్ సీక్వెన్స్ ఏ స్థాయిలో ఉండబోతోన్నాయో తనకు అర్థమైందని అతను చెప్పాడు.

తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’లో నటించాక తనకు దక్షిణాది నుంచి చాలా ఆఫర్లు వచ్చాయని.. కానీ అవేవీ ఒప్పుకోలేదని.. ‘సాహో’లో మాత్రం కచ్చితంగా నటించాలని అనిపించిందని చెప్పాడు. ఇలా ‘సాహో’ మీద ఇప్పటికే ఉన్న అంచనాల్ని పెంచేసేలా మాట్లాడాడు నీల్ నితిన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు