రొమాన్స్ ఎక్కువైంది.. క్లీన్-యు ఇవ్వ‌మ‌న్నార‌ట‌

రొమాన్స్ ఎక్కువైంది.. క్లీన్-యు ఇవ్వ‌మ‌న్నార‌ట‌

తెలుగులో ఉన్న అతి కొద్ది మంది లేడీ డైరెక్టర్లలో బి.జయ ఒకరు. చంటిగాడు.. లవ్లీ లాంటి సినిమాలతో ప‌ర్వాలేద‌నిపించారు. ఇప్పుడు తమ సొంత బేనర్లో తెరకెక్కించిన ‘వైశాఖం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారామె. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని.. ఈ నెల 21న ‘వైశాఖం’ ప్రేక్షకుల ముందుకొస్తుందని జయ వెల్లడించారు.

ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన సినిమాకు ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ వాళ్లను కోరినా వాళ్లు అంగీకరించలేదని చెప్పారు. ఇంతకముందు తీసిన సినిమాలతో పోలిస్తే ఇందులో రొమాన్స్ పాళ్లు ఎక్కువయ్యాయనని.. కాబట్టి ‘క్లీన్ యు’ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్లు జయ తెలిపారు. ఐతే సినిమా చాలా బాగుందంటూ సెన్సార్ వాళ్లు కితాబిచ్చారని జయ చెప్పారు. వాళ్లు అన్నట్లుగానే ఇందులో కొంచెం రొమాన్స్ డోస్ ఎక్కువే ఉంటుందని.. ఒక పాటను చాలా రొమాంటిగ్గా తీశానని జయ తెలిపారు.

ఈ చిత్రానికి పాటలే ప్రత్యేక ఆకర్షణ అని.. పెద్ద హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో పాటలు చిత్రీకరించామని జయ చెప్పారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఓ పాట లిరిక్స్.. దాని కంపోజిషన్ విన్నాక ఇది మహేష్ బాబు సినిమాలో ఉండదగ్గ పాట అనిపించిందని.. తమ సినిమాలో పెట్టుకోవాలా వద్దా అని కూడా ఆలోచించానని.. ఐతే ఓ చిన్న సినిమాలో గ్రాండ్ నెస్ ఉన్న పాట ఎందుకు ఉండకూడదు అని ఆలోచించి ఈ పాటను ఒక ఛాలెంజ్ గా తీసుకుని చిత్రీకరించానని జయ తెలిపారు. దర్శకురాలిగా తన కెరీర్లో ‘వైశాఖం’ బెస్ట్ ఫిలిం అవుతుందని ఆమె చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు