వర్మ తల వంచాడండోయ్..

వర్మ తల వంచాడండోయ్..

రామ్ గోపాల్ వర్మ ఎవరేమన్నా పట్టించుకునే రకం కాదు. పోలీస్ కేసులు.. కోర్టు నోటీసుల్ని కూడా వర్మ పెద్దగా పట్టించుకున్నట్లగా.. వాటికి భయపడ్డట్లుగా కనిపించడు. ఐతే తాజాగా ఒక కేసు విషయమై రామ్ గోపాల్ వర్మకు పంచ్ పడింది. ఈ కేసు వల్ల వర్మ కొత్త సినిమా ‘సర్కార్-3’ విడుదలే ఆగిపోయేలా ఉండటంతో వర్మ తలవంచక తప్పలేదు.

ఈ సినిమా రైటర్లలో తానూ ఒకడినని.. కానీ తనకు సినిమా టైటిల్స్‌లో క్రెడిట్ ఇవ్వలేదని.. అలాగే పారితోషకం కూడా పెండింగ్ పెట్టారని వర్మ మీద కోర్టుకెక్కాడు నీలేష్ గిర్కార్ అనే రైటర్. ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు.. తప్పు వర్మదేనని తేల్చింది. ప్రివ్యూ చూసిన అనంతరం వర్మకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది.

నీలేష్‌కు సినిమా టైటిల్స్‌లో రచయితగా క్రెడిట్ ఇవ్వాలని.. అలాగే అతడికి ఇవ్వాల్సిన రూ.6.2 లక్షల పెండింగ్ రెమ్యూనరేషన్ వెంటనే సెటిల్ చేయాలని ఆదేశించింది. దీంతో వర్మ మారు మాట్లాడకుండా కోర్టు చెప్పిందానికి అంగీకరించాడు.

‘సర్కార్-3’ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ కొత్త వివాదం వల్ల రిలీజ్‌కు మళ్లీ ఏవైనా అడ్డంకులు తలెత్తుతాయేమో అని కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవడానికి వర్మ బృందం ఓకే చెప్పింది. ‘సర్కార్-3’ వర్మ కెరీర్‌కు చాలా కీలకం. అటు బాలీవుడ్లో.. ఇటు టాలీవుడ్లో ఆయన క్రెడిబిలిటీ బాగా దెబ్బ తింది. ఈ సినిమా హిట్టవకపోతే వర్మ చాలా ఇబ్బందుల్లో పడతాడు. అందుకే ‘సర్కార్-3’పై చాలా ఆశలతో ఉన్నాడు వర్మ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు