జాతీయ అవార్డుల్లో కొత్త కేటగిరీ గమనించారా?

జాతీయ అవార్డుల్లో కొత్త కేటగిరీ గమనించారా?

ఈసారి జాతీయ అవార్డుల జాబితాలో ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్‌కు పురస్కారం దక్కడం గమనించే ఉంటారు. మరి గత ఏడాది ఈ అవార్డు ఎవరికి వచ్చింది.. ఇంతకుముందు ఎవరెవరు ఈ పురస్కారం అందుకున్నారని గమనిస్తే.. వాటిలో ఆ కేటగిరీనే కనిపించదు.

ఎందుకంటే ఈ అవార్డు ప్రకటించడం ఇదే తొలిసారి. చాలా ఏళ్లుగా ఫైట్ మాస్టర్లు డిమాండ్ చేస్తున్న అవార్డిది. అందరినీ గుర్తించి.. 24 క్రాఫ్ట్స్‌లో కీలకమైన తమకు మాత్రం గుర్తింపు ఎందుకివ్వరంటూ వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు వాళ్ల డిమాండ్ నెరవేరింది. బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పేరుతో కొత్త కేటగిరీ ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం దేశంలో నెంబర్ వన్ యాక్షన్ కొరియాగ్రాఫర్ అని ఎవ్వరైనా ఒప్పుకునే పీటర్ హెయినే తొలి అవార్డును అందుకోవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీటర్ ప్రతిభేంటో చెప్పడానికి ఎన్నో రుజువులున్నాయి. రోబో, బాహుబలి కంటే అందుకు పెద్ద ఉదాహరణలు అక్కర్లేదు. పీటర్ హెయిన్ అవార్డు అందుకున్నది మలయాళం సినిమా ‘పులి మురుగన్’కు కావడం విశేషం.

ఆ సినిమా చూసిన ఎవ్వరైనా.. పీటర్ హెయిన్ ఈ అవార్డుకు వంద శాతం అర్హుడని ఒప్పుకుంటారు. పులితో జరిగే పోరాటాలకు సంబంధించిన సన్నివేశాల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు పీటర్ హెయిన్. కథాకథనాల పరంగా మామూలు సినిమా అయిన ‘పులి మురుగన్’.. అంత పెద్ద హిట్టయిందంటే అందుకు ఒక కారణం ఇందులోని కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలే. ముఖ్యంగా ఇందులోని క్లైమాక్స్ ఫైట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే పీటర్ ఇప్పుడు జాతీయ అవార్డును సొంతం చేసుకోగలిగాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు