అన్నయ్యను వదలని ఎన్టీఆర్

అనుకున్నదే అయింది. జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కాదని తేలిపోయింది. త్రివిక్రమ్ స్థానంలోకి కొరటాల శివ వచ్చాడు. ఎన్టీఆర్ 30వ సినిమా ‘జనతా గ్యారేజ్’ కాంబినేషన్లో రాబోతున్నట్లు అధికారికంగా స్పష్టమైంది. కొరటాల మిత్రుడైన మిక్కిలేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ప్రధాన పెట్టుబడిదారు ఆయనే కానీ.. ఈ ప్రాజెక్టులో మరో నిర్మాణ భాగస్వామి కూడా ఉన్నారు. ఆయనే ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్.

హారిక హాసిని సంస్థ భాగస్వామ్యంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మించాల్సింది. అందులో అతను చిన్న వాటాదారు. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. త్రివిక్రమ్‌తో పాటు హారిక హాసిని అధితేన చినబాబు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ప్రధాన పెట్టుబడిదారుగా మిక్కిలినేని సుధాకర్ వచ్చారు కానీ.. కళ్యాణ్ రామ్ స్థానం మాత్రం మారలేదు.

ఇంతకుముందు ‘జై లవకుశ’ సినిమా చేసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌కు మంచి లాభాలు అందించాడు తారక్. అంతటితో ఆగకుండా అన్నయ్యకు మరో సినిమా చేయాలనుకుని త్రివిక్రమ్ చిత్రానికి నిర్మాణ భాగస్వామిని చేశాడు. దర్శకుడు, ప్రధాన నిర్మాత మారినా.. తన 30వ సినిమాలో కళ్యాణ్ రామ్‌ను అలాగే కొనసాగించాడు తారక్. కాగా త్రివిక్రమ్‌తో అనుకున్న సినిమాకు కళ్యాణ్ రామ్ ప్రి ప్రొడక్షన్ వర్క్ కోసమని కోటి రూపాయలు ఏఢాది కిందటే ఇచ్చాడట.

ఇప్పుడు ఆ సబ్జెక్ట్ క్యాన్సిల్ అవడంతో కళ్యాణ్ రామ్‌కు వడ్డీతో సహా హారిక హాసిన సంస్థ నుంచి డబ్బులు ఇప్పించేస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ విషయంలో చిన్న గ్యాప్ తలెత్తిందని.. అందువల్ల తారక్‌‌తో మళ్లీ త్రివిక్రమ్, చినబాబు సినిమా చేయాలనుకున్నపుడు అందులో కళ్యాణ్ రామ్ జోక్యం ఉండకపోవచ్చని అంటున్నారు. కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత తారక్.. త్రివిక్రమ్‌తో సినిమా చేస్తాడన్నది ప్రస్తుతానికి టాక్.