మళ్లీ సుడిగాడు కాంబినేషన్

మళ్లీ సుడిగాడు కాంబినేషన్

అల్లరి నరేష్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ సినిమా 'సుడిగాడు'. నరేష్ స్థాయికి మించి అనూహ్యమైన వసూళ్లు సాధించి.. అతడి కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఈ సినిమా. ఐతే ఈ సినిమా ఒకరకంగా అల్లరోడికి చెడు కూడా చేసింది. అప్పటిదాకా కొంచెం కొంచెం పేరడీలు.. స్పూఫ్‌లు చేస్తూ వచ్చిన నరేష్.. ఈ సినిమాలో హై డోస్ పేరడీ-స్పూఫ్ కామెడీ చేశాడు. అది జనాలకు విపరీతంగా నచ్చింది కానీ.. మళ్లీ అలాంటివి చేస్తే మాత్రం జనాలు చూడ్డానికి ఇష్టపడలేదు. 'సుడిగాడు' తర్వాత నరేష్‌కు నిఖార్సయిన హిట్టే లేదు. ప్రస్తుతం అతడి ఆశలన్నీ 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' మీదే ఉన్నాయి.

ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో కానీ.. మళ్లీ 'సుడిగాడు' లాంటి హిట్టు కొట్టాలని ఆ సినిమా డైరెక్ట్ చేసిన భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు నరేష్. కొత్త ఏడాదిలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. 'సుడిగాడు' తర్వాత 'స్పీడున్నోడు' సినిమా చేసిన భీమనేని కూడా ఎదురు దెబ్బ తిన్నాడు. మరి నరేష్-భీమనేని కాంబోలో రాబోయే రెండో సినిమా ఎలాంటి ఫలిలతాన్నందుకుంటుందో చూడాలి. దీని కంటే ముందు నరేష్ 'అలా ఎలా' ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదికి వెళ్లాల్సిన ఈ చిత్రం డీమానిటైజేషన్ వల్ల ఆగింది. త్వరలోనే ఈ చిత్రం మొదలవుతుంది. మరోవైపు తన స్వీయ దర్శకత్వంలో చేయబోయే సినిమాను 2020లో రిలీజ్ చేయాలన్న ప్రణాళికలోనూ ఉన్నాడు నరేష్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు