తన పెళ్లిపై సెటైర్‌ వేసుకున్న ప్రభాస్‌

తన పెళ్లిపై సెటైర్‌ వేసుకున్న ప్రభాస్‌

టాలీవుడ్లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరంటే మరో మాట లేకుండా ప్రభాస్‌ పేరు చెప్పేయొచ్చు. ఐతే నాలుగైదేళ్లుగా ఈ పోస్టులో కొనసాగుతున్న ప్రభాస్‌.. ఈ 'హోదా'ను వేరొకరికి ఇచ్చేసి పెళ్లి చేసుకుని సెటిలైతే చూడాలని కుటుంబ సభ్యుల ఆశ. కానీ అతనేమో పెళ్లి ఊసే ఎత్తట్లేదు. 'బాహుబలి'కి ముడిపెట్టి మూడేళ్ల పాటు పెళ్లి ప్రస్తావన లేకుండా చూసుకున్న ప్రభాస్‌.. 'ది కంక్లూజన్‌' అయ్యాకైనా పెళ్లి విషయంలో కంక్లూజన్‌కు వస్తాడో లేదో తెలియదు. ఈ లోపు 'ఆవు పులి మధ్యలో ప్రభాస్‌ పెళ్లి' అంటూ ప్రభాస్‌ పెళ్లి వ్యవహారాన్ని కామెడీ చేసేస్తూ ఓ సినిమా కూడా తీసేస్తున్నారు. మరోవైపు తాను రిలీజ్‌ చేసిన ఓ పాట సందర్భంగా స్వయంగా ప్రభాస్‌ తన పెళ్లి మీద తనే సెటైర్‌ వేసుకున్నాడు.

పూరి జగన్నాథ్‌ తమ్ముడు సాయిరాం శంకర్‌ హీరోగా 'అరకు రోడ్‌లో' అనే సినిమా ఒకటి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ పాట టీజర్‌ను ప్రభాస్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ''ఎప్పుడురా పెళ్లి.. అంటూ సాగే ఈ పాట గురించే రాసినట్లుంది. లిరిక్స్‌ చాలా క్యాచీగా ఉన్నాయి. సాంగ్‌ చాలా వెరైటీగా ఉంది. సహజంగా పూరి గారు కొన్ని సార్లు తన సినిమాల్లో ట్యూన్స్‌.. లిరిక్స్‌ కూడా రాసేస్తుంటారు. 'అరకు రోడ్‌లో' దర్శకుడు వాసుదేవ్‌ కూడా మల్టీ టాలెంటెడ్‌లా కనిపిస్తున్నాడు. ఈ సాంగ్‌ అదిరిపోయింది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పాడు. ప్రభాస్‌ పెళ్లి సంగతేమో కానీ.. అతడి ఆశీర్వాదంతో సాయిరాం శంకర్‌ ఒక హిట్టు కొడతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు