'ఊపిరి'ని పైరసీ చేశారంటున్న విశాల్

'ఊపిరి'ని పైరసీ చేశారంటున్న విశాల్

పైరసీ మీద అలుపెరగని పోరాటం చేస్తున్న కథానాయకుడిగా తమిళ హీరో విశాల్కు అక్కడ మంచి పేరుంది. ఏ హీరో అయినా.. నిర్మాత అయినా తన సినిమాలకు సంబంధించి పైరసీ తెరమీదికి వచ్చినపుడే స్పందిస్తాడు. ఐతే విశాల్ మాత్రం వేరే వాళ్ల సినిమాల కోసం కూడా పోరాడాడు. పైరసీ సీడీలు తయారు చేసే ఓ దుకాణం మీద నేరుగా వెళ్లి అటాక్ చేశాడు అతనోసారి. ఆ తర్వాత కూడా తన పోరాటం కొనసాగిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోని పీవీఆర్ మల్టీప్లెక్స్లో 24 మూవీ పైరసీ చేశారని తెలిసి విశాల్ రంగంలోకి దిగాడు. 24 సహ నిర్మాత జ్నానవేల్ రాజాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి నిర్మాతలందరినీ ఏకేశాడు. పైరసీ మీద చర్యలు తీసుకోకపోవడంపై నిర్మాతల మండలి అధ్యక్షుడైన థానుపై అతను మండిపడ్డాడు.

పీవీఆర్ థియేటర్లో మాత్రమే ఇటీవలే విడుదలైన ఏడు కొత్త చిత్రాలు పైరసీ చేసినట్టు గుర్తించామని, అమెరికాలోని ల్యాబ్ ద్వారా ఇది నిర్ధారించామని విశాల్ చెప్పాడు. వీఎస్ఓపీ, ఇంజి ఇడుప్పళగి {తెలుగులో సైజ్ జీరో}, 'తెరి {పోలీస్}, 24 చిత్రాలు ఈ థియేటర్లో పైరసీ అయ్యాయన్నాడు. నాగ్-కార్తి నటించిన తోళా {తెలుగులో ఊపిరి} కూడా పైరసీ చేశారన్నాడు. ఏడాదిన్నరగా పైరసీ సీడీలు, ఆనలైన్ పైరసీ వల్ల తమిళ సినిమా తీవ్రంగా నష్టపోయిందని, సుమారు వెయ్యి కోట్లు కోలీవుడ్ కోల్పోయిందని తెలిపాడు. ఒక సినిమా మొత్తం రాబడిలో 20 శాతం మాత్రమే నిర్మాతకు అందుతోందని, మిగతా 80 శాతం ఆదాయం పైరసీదారుల జేబుల్లోకి వెళ్తోందన్నాడు. పైరసీని అరికట్టకపోతే.. సినిమా విడుదలైన 15 రోజుల్లోనే 10వేల మంది ఏజంట్ల ద్వారా ఒరిజినల్ వీసీడీలు విడుదల చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు విశాల్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు