రెండో సినిమాతో జాతకం మారుతోంది...

రెండో సినిమాతో జాతకం మారుతోంది...

ఇండస్ట్రీలో ద్వితీయ విఘ్నం ఉందంటారు. తొలి సినిమా హిట్‌ కొట్టి.. రెండో సినిమాతో బోల్తా కొట్టిన దర్శకులు మన ఇండస్ట్రీలో బోలెడంత మంది ఉన్నారు. కానీ విచిత్రంగా ఇక్కడ సీన్‌ రివర్స్‌ అవుతోంది. తొలి సినిమాతో దిమ్మతిరిగే ఫ్లాప్‌ అందుకుని.. రెండో సినిమాతో గాడిన పడుతున్నారు కొందరు దర్శకులు. హను రాఘవపూడినే తీసుకోండి. ఈయన మొదటి సినిమా అందాల రాక్షసి. సినిమా కళాతక్మంగా ఉందన్నారు కానీ కమర్షియల్‌ గా సినిమా మాత్రం సక్సెస్‌ అందుకోలేదు. రాజమౌళి లాంటి దర్శకులు ప్రశంసించారు గానీ అందాల రాక్షసి మాత్రం అట్టర్‌ ఫ్లాపైంది. కానీ హను రాఘవపూడిపై నమ్మకంతో నాని అవకాశమిచ్చాడు. కృష్ణగాడి వీర ప్రేమగాధతో సక్సెస్‌ అందుకున్నాడు.

కిషోర్‌ తిరుమల కూడా అంతే. ఈయన తొలి సినిమా సెకండ్‌ హ్యాండ్‌ గురించి ఎవ్వరికీ తెలియదు. కానీ నేను శైలజతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. రెండో అవకాశంతో ఏకంగా క్రేజీ దర్శకుడు అనిపించుకున్నాడు. రామ్‌ తో నాలుగేళ్లుగా దోబూచులాడుతున్న విజయాన్ని నేను శైలజతో అందించాడు కిషోర్‌. ప్రస్తుతం ఈ దర్శకుడు నితిన్‌ తో ఓ సినిమా.. వెంకటేశ్‌ తో మరో సినిమాకు కమిటయ్యాడు.

సంపత్‌ నంది కూడా రెండో సినిమాతో వెలుగులోకి వచ్చిన దర్శకుడే. ఏమైంది ఈవేళతో ఓకే అనిపించుకున్నా.. సంపత్‌ క్రేజ్‌ తెచ్చుకుంది మాత్రం రచ్చ సినిమాతోనే. రామ్‌ చరణ్‌ మాస్‌ ఇమేజ్‌ ను పర్‌ ఫెక్ట్‌ గా వాడుకుంటూ సంపత్‌ చేసిన రచ్చ బాక్సాఫీస్‌ దగ్గర రచ్చ రచ్చ చేసింది.

ఇక హరీష్‌ శంకర్‌ కూడా తొలి సినిమాతో షాక్‌ ఇచ్చినా.. రెండో సినిమా మిరపకాయ్‌ తో తన టాలెంట్‌ ఘాటేంటో చూపించాడు. మొత్తానికి ద్వితీయ విఘ్నాన్ని దిగ్విజయంగా దాటేస్తున్నారు మన కుర్ర దర్శకులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు