సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారు పార్టీ పేరు చెప్పి దందాలు చేయడం సహజం. లేదా.. అగ్రనాయకుల పేర్లు చెప్పి ఇతర నేతలు దందాలు చేయడం కామనే. ఇది రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించేదే. ఇక, అధికారంలో ఉన్న పార్టీలకు ఈ తరహా పరిస్థితులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితే జనసేనకు కూడా ఎదురైంది. ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తమకు సంబంధాలు ఉన్నాయని, ఆయనతో తమకు మంచి రెపో ఉందని పేర్కొంటూ పలువురు నాయకులు దందాలు చేశారంటే సరే.. కామనేకదా! అని సరిపుచ్చుకునేందుకు అవకాశం ఉంది.
కానీ, చిత్రం ఏంటంటే.. పార్టీలతో సంబంధం లేని జిల్లా అధికారి ఒకరు పవన్ పేరు చెప్పి దందాలకు పాల్పడుతుండడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగానే కాకుండా ఏపీ అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాకు(పవన్ కల్యాణ్ గెలిచిన పిఠాపురం నియోజకవర్గం ఈ జిల్లాలోదే) చెందిన జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి ఏకంగా.. పవన్ కల్యాణ్ పేరు చెప్పి దందాలకు దిగినట్టు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వ్యాపారులను, ఇతర ప్రముఖులను కూడా ఆయన బెదిరించి లంచాలు వసూలు చేస్తున్నారని సమాచారం.
దీనిపై కాకినాడ జిల్లా జనసేన నాయకులు, నేరుగా పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇది జరిగిన నాలుగు రోజులు అయింది. అయితే.. ఈ విషయంపై రహస్యంగా విచారణ చేయించిన పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులను ఈ విషయంపై నివేదిక కోరారు. నివేదిక అందిన తర్వాత.. సదరు అధికారిపై చర్యలు తీసుకుంటానని ఆయన పార్టీ నాయకులకు తాజాగా హామీ ఇచ్చారు. తన పేరును, తన కార్యాలయం పేరును దుర్వినియోగం చేస్తున్న రవీంధ్రనాథ్ రెడ్డి వ్యవహారంపై పవన్ కల్యాణ్ ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ నాయకులు చెప్పారు.
వాస్తవానికి ఈ ఏడాది ఎన్నికల ఎన్నికల తర్వాత.. పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అని రాసుకుని పలువురు యువకులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వ్యవహరించారు. అప్పట్లో దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. అసలు అలా రాసి ఉన్న బండ్లను 24 గంటల్లోనే గుర్తించి భారీ ఫైన్లు వేయాలని ఆదేశించారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒక జిల్లా అధికారి ఇలా తన పేరును వాడుకుని.. తనకు చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తుండడంతో పవన్ కల్యాణ్.. సదరు అధికారిని కఠినంగా శిక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates