తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునల మధ్య వివాదం తారస్థాయికి చేరుతోంది. కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా సమంత వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని..ఆమె దూకుడు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై 100 కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అంతేకాకుండా.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా అభ్యర్థించారు.
తాజాగా నాంపల్లి కోర్టుకు వచ్చిన నాగార్జున తన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కొండా సురేఖ తమ కుటుంబాన్ని రాజకీయాల్లో కి లాగారని.. అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారని.. దీనివల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం ఏర్పడిందని అందుకే కోర్టును ఆశ్రయించినట్టు నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా నాగార్జున అభ్యర్థించారు. ఇదిలావుంటే.. కొండా సురేఖ తరఫు న్యాయవాది మాత్రం.. ఇప్పటికే ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారని.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై ఉద్దేశ పూర్వకంగా కుట్ర చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నాగార్జున లెక్కలు సరిచేస్తాం!
కొండా సురేఖ తరఫు న్యాయవాది నాంపల్లి కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జుల లెక్కలు సరిచేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్-కన్వెన్షన్ ను ఆక్రమిత ప్రాంతంలో నిర్మించారని.. అందుకే ప్రభుత్వం కూల్చి వేసిందని చెప్పారు. కానీ, దీనిని మనసులో పెట్టుకుని సర్కారును బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నాగార్జునపై తాము పరువునష్టం దావా వేస్తామని అన్నారు. అంతేకాదు.. నాగార్జున అఫైర్ల గురించి కేటీఆర్, కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. వారి ఫోన్ సంభాషణలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. అంతేకాదు.. టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్ని విషయాలను సమాచార హక్కు చట్టం కింద తీస్తున్నామన్నారు.