ఢిల్లీ టూర్ పై చంద్రబాబు కామెంట్స్

ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజుల పాటు పర్యటించిన సంగతి తెలిసిందే. హస్తిన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన గురించి మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.

ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధాని మోదీకి వివరించానని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసం గురించి, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించానని అన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. విశాఖ ఉక్కు వ్యవహారం తనకు అత్యంత జటిలమైన సమస్య అని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడాన్ని సెయిల్‌, కేంద్రం అంగీకరించాలని కోరారు.

కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడనని ,ప్లాంట్‌ను రివైజ్డ్‌ చేయాలని , ప్లాంట్‌ను శాశ్వతంగా కాపాడుకోవడానికి ఉన్న అవకాశాలను ఆలోచిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌-అమరావతి, అమరావతి-చెన్నై, హైదరాబాద్‌-చెన్నై కనెక్టివిటీ చేస్తూ బుల్లెట్‌ ట్రేన్‌ ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. గత ప్రభుత్వం కేంద్రం పథకాలు, నిధులు ఉపయోగించుకోకపోవడం వంటి చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు తొలి దశ కింద రూ.12,500 కోట్లు క్లియర్ చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశానన్నారు.

అమరావతికి తొలి దశ కింద రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చిందని, 2024 డిసెంబరు నుంచి అన్ని పనులు ప్రారంభమవుతాయని చంద్రబాబు చెప్పారు.

గత ప్రభుత్వ విధ్వంసం వల్ల నాశనమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని, స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్ తయారుచేస్తున్నామని చెప్పారు.

పలు అంశాలపై ప్రధాని మోదీకి స్పష్టతనిచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. చాలావరకు ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇదే సహకారం భవిష్యత్తులోనూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారని, వారికి ధన్యవాదాలు తెలియజేశానని వివరించారు.