రాజకీయాల్లో వ్యూహాలు ఎవరి సొంతమూ కాదు. తాడి తన్నేవాడికి తలతన్నేవాడు ఉంటాడన్నట్టుగా రాజకీయాల్లోనూ ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు నాయకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
తాజాగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకుని ఇంచార్జులను నియమించింది. తద్వారా.. పార్టీపై పట్టు సాధించేందుకు ప్రజల్లోకి దూసుకుపోయేందుకు చంద్రబాబు భారీగానే కసరత్తు చేశారు. ఈ వ్యూహం ఫలిస్తే.. టీడీపీకి 2014 నాటి క్రేజ్ రావడం ఖాయమనేది ఆ పార్టీ సీనియర్ల మాట. అంతేకాదు, ఈ పరిణామం మంచిదేనని.. అవసాన దశకు చేరుతుందనుకున్న పార్టీ అంబరాన్నంటే దిశగా దూసుకుపోవడం అవసరమేనని అంటున్నారు.
మరి ప్రత్యర్థి పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తే.. అధికార పక్షం చూస్తూ కూర్చుంటుందా? ఎత్తుకు పైఎత్తు వేయకుండా ఉంటుందా? అంటే.. ఉండదనే అంటున్నారు వైసీపీ నాయకులు. సీఎం జగన్ కూడా వైసీపీని మరింత బలోపేతం కాదుకాదు.. పటిష్ఠం చేసే దిశగా అడుగులు వ్యూహాలు వేస్తున్నారు. ఈ సారి ఆయన జిల్లాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా జరిగిన కీలక మంత్రుల సమావేశంలో టీడీపీ నియమించిన పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్‌ల అంశం ప్రస్థావనకు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రజల్లో మంచి ఊపు తెస్తున్నాయని బొత్స, పెద్దిరెడ్డి వంటి సీనియర్ మంత్రులు వెల్లడించారు.
ఇక, స్పందన కార్యక్రమం కూడా విజయవంతంగా అమలు జరుగుతోందని చెప్పినట్టు తెలిసింది. అయినప్పటికీ.. పథకాలకు, పార్టీ వ్యూహాలకు మధ్య తేడా ఉంటుందని, పథకాల దారి పథకాలదే.. పార్టీ దారి పార్టీదేనని సీఎం చెప్పినట్టు వైసీపీ వర్గాలు అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు సామాజిక వర్గాలు, వివిధ వృత్తులను చేసుకునేవారికి అమలు చేసిన పథకాల అంశం ప్రధానంగా ప్రచారం చేస్తూనే.. జిల్లాలపై ప్రత్యేకంగా దృస్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. దీనిలో భాగంగా.. ప్రతి జిల్లాలోనూ అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
అంటే.. ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాలుగా సమస్యలుగా ఉన్న వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ సూచించినట్టు తెలిసింది. దీనికి గాను సుమారు.. 500 కోట్లను వచ్చే రెండు మూడు మాసాల్లో కేటాయించే అవకాశం ఉందని.. ఫలితంగా వైసీపీ దూకుడును మరింత పెంచేందుకు ఛాన్స్ ఉంటుందని నిర్ణయించినట్టు తెలిసిందే. మరీ ముఖ్యంగా.. టీడీపీ ప్రభుత్వం గతంలో చేస్తామని చెప్పి చేయకుండా వదిలేసిన పనులను ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేయడం ద్వారా వైసీపీకి జిల్లాలను మరింతగా కనెక్ట్ చేయాలనేది వ్యూహంగా ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి రాజకీయాల్లో వ్యూహానికి ప్రతివ్యూహం ఏ రేంజ్లో అయినా ఉండొచ్చని అంటున్నారు నాయకులు.