తెలంగాణ టీడీపీకి జోష్.. సైకిలెక్కేందుకు నేతల క్యూ!

తెలంగాణ టీడీపీకి జోష్ వ‌చ్చింది. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత‌.. పార్టీకి పున‌ర్‌వైభ‌వం తెచ్చేలా.. వ‌చ్చేలా పార్టీ అధినేత చంద్ర‌బాబు తీసుకున్న‌, తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తున్నాయి. ఈ క్ర‌మంలో గ‌తంలో పార్టీకి దూర‌మైన కీల‌క నాయ‌కులు ఇప్పుడు తిరిగి సైకిల్ ఎక్కేందుకు క్యూ క‌డుతున్నారు. తాజాగా సీఎం చంద్ర‌బాబును తెలంగాణ‌లోని ఇత‌ర పార్టీల నాయ‌కులు క‌లుసుకున్నారు. వీరిలో చాలా మంది కీల‌క నేత‌లే ఉండ‌డం గ‌మ‌నార్హం.

హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డి, ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు మ‌ర్రి రాజ‌శేఖ‌రెడ్డి, మ‌ల్లారెడ్డి త‌దత‌రులు చంద్ర‌బాబును ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు పార్టీలో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. తీగ‌ల కృష్నారెడ్డి.. గ‌తంలో టీడీపీలో ఉన్న విష‌యం తెలిసిందే. టీడీపీ నేత‌గానే ఆయ‌న హైద‌రాబాద్ మేయ‌ర్‌గా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో పార్టీ మారిపోయారు. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయంగా పార్టీల‌కు దూరంగా ఉంటున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబును క‌లిసిన తీగ‌ల పార్టీలో చేరుతానంటూ ప్ర‌క‌టించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ త‌న‌కు పుట్టినిల్లు వంటిద‌ని.. రాజ‌కీయాల్లో త‌న‌కు అనేక ప‌ద‌వులు ఇచ్చింద‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే సైకిల్ ఎక్క‌నున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ప‌నిచేయ‌డం త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంటుంద‌ని తెలిపారు. అదేవిధంగా ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు, మామ అల్లుళ్లు మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి, మ‌ల్లా రెడ్డి కూడా.. చంద్ర‌బాబుతో ఇదే విష‌యంపై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

అయితే.. వీరు కృష్ణారెడ్డి మాదిరిగా బ‌య‌ట‌కు ఏమీ చెప్ప‌క‌పోయినా.. పార్టీ మారేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. త్వ‌ర‌లోనే చంద్ర‌బాబును మ‌రోసారి క‌లిసేందుకు కూడా అప్పాయింట్‌మెంటు కోరిన‌ట్టు స‌మాచారం. బీఆర్ ఎస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న వీరిద్ద‌రూ.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం నుంచి సెగ ను ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీడీపీ వైపు మొగ్గు చూపడం గ‌మ‌నార్హం.