సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటన అధికారికం. కేంద్ర ప్రభుత్వమే.. ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. తాజాగా రెండు రోజుల కిందట ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో 40 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలవనున్నారు.
కేవలం మావోయిస్టు సమస్యలపైనే కాకుండా.. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపైనా చంద్రబాబు ప్రధానికి వివరించనున్నారు. బుడమేరు పటిష్టం, వరద బాధితులకు సాయం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయడం, పోలవరానికి బడ్జెట్‌లో కేటాయించిన నిధుల విడుదలతోపాటు వెనుక బడిన జిల్లాలకు నిధుల విడుదల వంటి అంశాలపైనే చర్చిస్తారని.. పార్టీకార్యాలయం తెలిపింది.
అయితే.. చంద్రబాబు ఢిల్లీ టూర్ పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చాలా ఉత్సుకతతో కూపీ లాగుతున్నారు. ఆయన ఏం మాట్లాడతారు? ఏం చేస్తారు? అనే విషయాలపై జగన్ ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. దీనికి కారణం.. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదమే. ఈ వివాదం తెరమీదికి వచ్చిన తర్వాత.. బీజేపీ పూర్తిగా చంద్రబాబు వెంటే నిలిచింది. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి కూడా.. చంద్రబాబును వెనుకేసుకుని వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.
ఇక, కేంద్రంలోని కొందరు సచివులు కూడా .. తిరుమల బాలాజీ లడ్డూ అపవిత్రం కావడంపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు పర్యటనలో ఖచ్చితంగా లడ్డూ ప్రస్తావన లేకుండా ఉండద ని జగన్ భావిస్తున్నారు. తన హయాంలో చోటు చేసుకున్న తిరుమల అక్రమాలపై ఇప్పటికే సమాచారం సేకరించిన చంద్రబాబు వీటిపై ప్రధానికి మరిన్ని ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని ఆయన తలపో స్తున్నారు. ఇదే జరిగితే.. తనకున్న పరువు మరింత పోతుందని ఆయన భయపడుతున్న ట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులను నియమించాల్సి ఉంది. సీబీఐ ఎంత స్వతంత్ర సంస్థ అయినా.. ప్రధాని చేతిలో పనిచేస్తోందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. అందుకే పదేళ్లుగా జగన్‌పై సీబీఐ దూకుడు తగ్గించిందన్న విమర్శలు కూడా తెలిసిందే. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన విషయంలో జగన్ భయపడుతుండడంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.