వైసీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. పుంగనూరు-చిత్తూరు సరిహద్దు ప్రాంతమైన అంగళ్లు ప్రాంతానికి వచ్చినప్పుడు.. పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. వాస్తవానికి పుంగనూరు పర్యటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని.. కానీ, చంద్రబాబు అంగళ్లు ప్రాంతం నుంచి పుంగనూరులోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయనను అడుగు కూడా పెట్టనివ్వలేదు.
ఇక, చంద్రబాబు పుంగనూరులో అడుగు పెడుతున్నారని తెలిసి.. వైసీపీ నాయకులు కూడా విజృంభించారు. ఈ క్రమంలోనే టీడీపీ-వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర రణరంగం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సిబ్బంది కూడా రాళ్లు తగిలి గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటనపై వైసీపీ నేత ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పుంగనూరు పోలీసులు చంద్రబాబు, దేవినేని ఉమా సహా అనేక మంది నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల విచారణ ప్రారంభమయ్యేలోగానే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. అయితే.. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఈ కేసు యూటర్న్ తీసుకుంది. అప్పటి వరకు ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ‘ఇది ఉత్తుత్తి కేసే.. దీనిలో ఏమీ లేదు’ అని పేర్కొంటూ.. జిల్లా కోర్టులో అఫిడవిట్ సమర్పించి.. కేసును కొట్టేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో జిల్లా కోర్టు నుంచి సంచలన ఆదేశాలు వచ్చాయి. ఫిర్యాదు చేసిన ఉమాపతి రెడ్డి ఏం చెబుతున్నారో తెలుసుకోవాలని ఆదేశించింది.
దీంతో పోలీసులు ఉమాపతి రెడ్డి నుంచి అఫిడవిట్ కోరారు. ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు తమకు లిఖిత పూర్వకంగా అఫిడవిట్ ఇవ్వాలని ఆయనను కోరారు(ఆయన మాత్రం తనను బెదిరిం చారని చెబుతున్నారు. దీనిపై కూడా మరో కేసు కోర్టులోనే వేస్తానని చెబుతున్నారు). కానీ, ఉమాపతి మాత్రం కేసును వెనక్కి తీసుకునేది లేదని చెబుతున్నారు. అవసరమైతే.. తనపై ఒత్తిడి చేస్తున్న పోలీసులపై హైకోర్టులో కేసు వేస్తానని అంటున్నారు. దీంతో అంగళ్లు కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.