తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. 10 ఏండ్ల కిందట కరపత్రాలకే సొమ్ములు లేవని చందాలు అడిగిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఇప్పుడు 1500 కోట్ల రూపాయల పైగా నిధులు వచ్చాయన్నారు. ఈ సొమ్ముడు ఏడ నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. “అధికారంలో ఉండగా.. అదిలించి.. బెదిరించి.. రాబట్టుకున్న సొమ్ములు కాదా? కాదని చెప్పే ధైర్యం ఉందా?” అని నిలదీశారు.
తెలంగాణ ఉద్యమంతో తప్ప.. కేసీఆర్ ఎలివేషన్‌కు మరో మార్గం కూడా లేదన్నారు. ఇంకా.. దానినే పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. “పదేళ్ల పాలనలో ఇది చేసినం.. అది చేసినం అని చెప్పుకొని ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేని వాళ్లు మాకు పాఠాలు చెబుతున్నారు” అని రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం అనే ముసుగు పెట్టుకుని తెలంగాణ సమాజం నుంచి గౌరవం పొందారని.. దానిని తీసేస్తే.. ఏపాటి గౌరవం ఉంటుందో అందరికీ తెలిసిందేనన్నారు.
మూసీ పేరు ఎందుకు పెట్టుకోరు..
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనేక మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలకు గంగ, కావేరీ, కృష్ణ వేణి, గోదావరి అని నదుల పేరు పెట్టుకున్నారు. కానీ, మూసీ నది పేరు ఎందుకు పెట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఎందకంటే.. మూసీ అంటే మురికి కాసారం కాబట్టే ఆ పేరు పెట్టుకోలేదని, ఇప్పుడు దానినే తాము సంస్కరిస్తున్నామని.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎందరు అడ్డు పడినా.. మూసిని ప్రక్షాళన చేసి తీరుతామన్నారు.
ప్రజల గూడు చెదిరిపోతుందని ఆలోచిస్తే.. ప్రాజెక్టులు వచ్చేవా? అని ప్రశ్నించారు. నిరాశ్రయులయ్యే వారికి అండగా ఉంటామని.. మూసీ నదిని మాత్రం ప్రక్షాళన చేసి తీరుతామని రేవంత్ చెప్పారు. మల్లన్నసాగర్ కోసం రైతులను బలవంతంగా ఖాళీ చేయించినప్పుడు.. ఈ నేతలకు మనసు ఎలా వచ్చిందో చెప్పాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.