సీఎం చంద్రబాబుతో బీజేపీ నాయకుడు, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో తాజాగా ఆదివారం ఇరువురు నాయకులు భేటీ అయ్యారు. సుమారు గంట సేపు ఈ భేటీ జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ఏం చర్చించారనే విషయాలపై రెండు కీలక అంశాలు తెరమీదికి వచ్చాయి. 1) పార్టీ మారి టీడీపీలోకి చేరడం. 2) టీటీడీ బోర్డు చైర్మన్ పదవి. ఈ రెండు అంశాలపైనే ఇరువురు చర్చించుకున్నారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిరణ్‌కుమార్ రెడ్డి ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. అయితే.. ఆయన వైసీపీ నాయకుడు, సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఎంతో మంది జూనియర్ నాయకులు విజయం దక్కించుకున్నా.. తన సొంత గడ్డపై కిరణ్ ఓడిపోవడం గమనార్హం. ఆ తర్వాత.. ఆయన పార్టీలోను.. నామినేటెడ్ పదవుల విషయంలోనూ కేంద్రంలోని బీజేపీకి వర్తమానాలు పంపించారు. కానీ, స్పందించలేదు.
ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించారు. అంతేకాదు.. టీడీపీ నేతలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరు అవుతుండడం గమనార్హం. ఇంతటితోనే కథ అయిపోలేదు. ఏవేదిక ఎక్కినా.. చంద్రబాబు పాలన తీరును ఆయన ప్రశంసిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో బీజేపీ కూడా అధికారంలోనే ఉంది. అయినా.. దానిని ఎక్కడా ప్రస్తావించకుండా.. చంద్రబాబు ను మాత్రమే హైలెట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజా చర్చల వెనుక ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునే అభిప్రాయం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం కిరణ్ సోదరులు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీ తరఫున పీలేరు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. ఎలానూ సోదరుడు టీడీపీలోనే ఉన్నారు కాబట్టి.. ఆయన చేరినా ఆశ్చర్యం లేదు. ఇక, మరో కీలక అంశం టీటీడీ బోర్డు చైర్మన్ పదవి. ఈ పదవి కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. తాజాగా కిరణ్ కుమార్‌రెడ్డి కూడా ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారని మరికొందరు చెబుతున్నా రు. అందుకే నేరుగా చంద్రబాబును కలిసి అభ్యర్థించి ఉంటారన్న చర్చకూడా నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.