తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. “నేను చెప్పినట్టే కేసీఆర్ ఉద్యోగం పోయింది. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి” అని పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి సీఎం అప్పాయింట్‌మెంట్ లెటర్లు అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయన్నారు.
అందుకే అప్పట్లో తాను.. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ పిలుపుతో చేపట్టిన ఉద్యమానికి నిరుద్యోగులు మద్దతుగా నిలిచారన్నారు. అప్పట్లోనే తాను.. కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు పోతే తప్ప.. సాధారణ నిరుద్యోగులకు, పేదలకు ఉద్యోగాలు రావని చెప్పానని ఇప్పుడు అదే జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏళ్ల తరబడి నిరుద్యోగులను వేధించిందని విమర్శించారు. “ఎన్నికల సమయంలో ప్రకటనలు గుప్పిస్తరు. తర్వాత.. పక్కన పెడతరు” అని దుయ్యబట్టారు.
తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పుతోనే ఇప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చాయని తెలిపారు. ఆ మార్పుకు నాంది పలికిన నిరుద్యోగుల కలలు నెరవేరుస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చిందే.. నిధులు-నియామకాల కోసమని. కానీ, ఈ విషయాన్ని కేసీఆర్ కుటుంబం తమకు ఆపాదించుకుని నిధులు-నియామకాలు అంటే తమ కుటుంబానికే అనుకుందని ఫలితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించలేదని దుయ్యబట్టారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యువతకు పెద్ద పీట వేస్తోందని రేవంత్ చెప్పారు. త్వరలోనే చేపట్టనున్న రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణంలో ప్రస్తుతం ఇంజనీర్లుగా ఉద్యోగాలు పొందిన వారే కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీలలోనూ యువ ఉద్యోగుల పాత్రం కీలకంగా మారనుందని వెల్లడించారు.