తిరుమ‌ల – చంద్ర‌బాబు.. ఈ రికార్డు తెలుసా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ – ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల వ్య‌వ‌హారం అనేక మ‌లుపులు తిరుగు తున్న నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రోసారి కీల‌క విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. తిరుమ‌ల‌-చంద్ర‌బాబుల‌కు సంబంధించిన స‌రికొత్త రికార్డు ఆవిష్కృత‌మైంది. తాజాగా శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతు న్నాయి. ఏటా ఆశ్వీయుజ మాసం పాడ్య‌మి నుంచి 9 రోజుల పాటు నిర్వ‌హించే ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. ఈ ఏడాది కూడా ఈ ఉత్సాలు ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు దంప‌తులు స‌ర్కారు త‌ర‌ఫున స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిం చారు. అయితే ఎప్పుడూ జ‌రిగేదే క‌దా! అనే అనుమానం వ‌స్తుంది. కానీ, ఇక్క‌డే చిత్ర‌మైన విష‌యం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు స్వామివారికి అత్య‌ధిక సంఖ్య‌లో ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు రికార్డు సృష్టించారు. 14 ఏళ్లు గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు.. ఇప్పుడు 15 వ సంవ‌త్స‌రంలో ఉన్నారు. సో.. ఆయ‌న 15 సార్లు స్వామివారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన‌ట్టు అయింది.

ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ముఖ్య‌మంత్రి కూడా 15 సార్లు శ్రీవారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌లేదు. దీంతో ఈ రికార్డు చంద్ర‌బాబుకే సొంత‌మైంది. ఏటా సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఇచ్చే ప‌ట్టు వ‌స్త్రాల‌ను తాజాగా చంద్ర‌బాబు దంప‌తులు స్వామికి స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన సీఎంల‌లో ఎక్కువ సంఖ్య‌లో రికార్డును సృష్టించారంటూ.. టీటీడీ అధికారులే స్వ‌యంగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీంతో చంద్ర‌బాబు దంప‌తులు మురిసిపోయారు.

ఇది నా అదృష్టం!

శుక్ర‌వారం రాత్రి పొద్దు పోయాక జ‌రిగిన వాహ‌న సేవ‌ల్లో పాల్గొన్న చంద్ర‌బాబు దంప‌తులు శ్రీవారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అత్యధిక సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు, ఇతర లాంఛనాలు సమర్పించే అదృష్టం తనకు లభించిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. అనంత‌రం.. శ్రీవారి మూల మూర్తిని ద‌ర్శించుకున్నారు. కొద్దిసేపు వాహ‌న సేవ‌ల్లోనూ పాల్గొన్నారు.