తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సీబీఐ సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పును ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్వాగతించారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.
తిరుమలలో రెండో రోజు పర్యటనలో భాగంగా అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించిన అనంతరం అధికారులకు లడ్డూ తయారీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు తన అభిప్రాయం చెప్పే అవకాశం కల్పించాలని, వారి సూచనలు పరిగణలోకి తీసుకొని సేవలు మెరుగుపరిచేందుకు టీటీడీ పనిచేయాలని చంద్రబాబు సూచించారు.
తిరుమల ఆలయ పవిత్రతను, భక్తుల నమ్మకాన్ని కాపాడే విధంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరేదీ వినిపించకూడదని అన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడకూడదని, భవిష్యత్ నీటి అవసరాల కోసం ముందస్తు ప్రణాళికలు చేయాలని సూచించారు.
అటవీ ప్రాంత విస్తరణను 72 నుంచి 80 శాతం వరకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కాకుండా, ఆధ్యాత్మికత ఉట్టిపడాలని చెప్పారు. ఆర్భాటం, అనవసర ఖర్చులు తగ్గించాలని, భక్తులను గౌరవించాలని, దేశ విదేశాల నుండి వచ్చే భక్తులతో గౌరవంగా మెలగాలని సూచించారు.
తిరుమలలో గత ప్రభుత్వం కల్పించిన సదుపాయాలకు, ఈ ప్రభుత్వం కల్పించిన సదుపాయాలకు తేడా ఉందని భక్తులు తనతో చెప్పారని చంద్రబాబు అన్నారు. తిరుమలలో లడ్డూ, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని తెలిపారు. ప్రసాదం నాణ్యత ఇలాగే కొనసాగాలని, ఇంకా మెరుగుపడేలా చూడాలని అధికారులకు సూచించారు. పరిశుభ్రత, ఆలోచనా విధానం, మేనేజ్ మెంట్ లో మార్పు వచ్చిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.