తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. దేశమంతా ఒకటే గళం వినిపించాలని, జాతి, మత భేదం లేకుండా మాట్లాడాలని వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలని పవన్ అన్నారు.
సనాతన ధర్మంపై దాడులు జరుగుతుంటే ఎదురు దాడి చేయడం లేదని, ఆవేదన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. సెక్యులరిజం వన్ వే కాదని, టూ వే అని, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని పవన్ అన్నారు. ఈ వారాహి డిక్లరేషన్ ను తిరుపతి స్వామి వారి సన్నిధి నుండి ప్రకటిస్తున్నానని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పిలుపునిస్తున్నానని పవన్ చెప్పారు.
తప్పు అని తెలిసినపుడు మతాలకు అతీతంగా మాట్లాడాలి కదా? అని పవన్ అన్నారు. హిందువులలో చిత్ర పరిశ్రమ, పారిశ్రామిక వేత్తలు, మేధావులు ఉన్నారని, వారంతా సనాతన ధర్మానికి భంగం కలిగినప్పుడు ఎందుకు మాట్లాడరని అన్నారు. మహ్మద్ ప్రవక్త లేదా జీసస్ మీద ఇలా జరిగితే మౌనంగా ఉంటారా? ఇదేనా మీ సెక్యులరిజం? అని ప్రశ్నించారు. ఇతర మతాలపై దాడి జరిగితే అందరూ మాట్లాడుతారని, కానీ సనాతన ధర్మం పై దాడి జరిగితే మాత్రం ఏ ఒక్కరూ మాట్లాడరని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అన్ని మతాల సంస్కృతి, దేవతా మూర్తుల బొమ్మలు ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకి అది నిదర్శనం అని, ఆ విషయానికి ప్రధాని మోడీ మళ్లీ ప్రాచుర్యం కల్పించారని పవన్ అన్నారు.
7 పాయింట్లతో వారాహి డిక్లరేషన్:
- ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి
- సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి
- సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి
- సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి
- సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి
- ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి
- ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలు, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి