తిరుపతిలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జ్వరంతో బాధపడుతూ స్వల్ప అస్వస్థతకు గురైనప్పటికీ పవన్ కల్యాణ్ ఈ సభలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి పాదాల సాక్షిగా, శ్రీవారి పాదాల సాక్షిగా చెబుతున్నానని…ఇలా రోడ్డు మీదకు వచ్చి ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడాల్సిన అవసరం వస్తుందనుకోలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని, తన ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా తాను బాధపడనని అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే చూస్తూ ఊరుకోబోనని పవన్ చెప్పారు.
గత దశాబ్ద కాలంగా తనను, తన కుటుంబాన్ని అవమానించారని, నీచంగా మాట్లాడారాని పవన్ చెప్పారు. అయినా తాను ఒక్క మాట మాట్లాడలేదని, అధికారం వచ్చినా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకోలేదని అన్నారు. తన చిన్న కూతురు చేత తిరుమల డిక్లరేషన్ ఇప్పించానని, నిజమైన సంప్రదాయాలు పాటించే వ్యక్తిని అని చెప్పారు.
సనాతన ధర్మం పై దాడులు జరుగుతుంటే ఈ మధ్య కోర్టులు వాటిని సమర్డిస్తున్నాయని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయిన వాడికి కంచాలు, కానివాడికి ఆకులు అన్నట్లుగా ఉన్నారని విమర్శించారు. ఇప్పుడు ఆకులు కూడా లేవు, చేతిలో పెడతాం నాకండి అంటున్నారు అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సనాతన ధర్మంపై దాడులు చేసిన వారిని కోర్టులు కాపాడటం దురదృష్టకరమని పవన్ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.
తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. గతంలోనే వైసీపీ వారిని హెచ్చరించినా వారు వినలేదని చెప్పారు.
ఈ రోజూ ఏపీ ఉప ముఖ్యమంత్రి గానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రజల ముందుకు రాలేదని, సగటు హిందువుగా, సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా, భారతీయుడిగా ప్రజల ముందుకు వచ్చానని పవన్ చెప్పారు. తాను హిందూ మతాన్ని అనుసరిస్తానని, ఇస్లాం, క్రిస్టియానిటి, సిఖ్, ఇతర అన్ని మతాలను గౌరవిస్తానని పవన్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates