భ్రమ- ఆనందపడటానికి మంచిదే కావొచ్చు. కానీ, అన్ని వేళలా భ్రమలో బతికేస్తామంటే ప్రజలు నవ్విపోతారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలోనూ ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. ఆయన ఇంకా భ్రమల్లోనే బతికేస్తున్నారన్నది వైసీపీ నేతలే చెబుతున్నారు. ఇక, సాధారణ మీడియా మరింత యాగీ చేస్తున్న విషయం తెలిసిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పుల దిశగా ఎవరైనా అడుగులు వేయా ల్సిందే. దీనిలో ఎలాంటి తేడా లేదు. అయితే.. ఆ మార్పు దిశగా జగన్ అడుగులు పడడం లేదు.
ఇంకా తానే మంచి చేశానని చెబుతున్నారు. తాను లేకపోవడంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తాజాగా కూడా వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి నాయకులతో నిర్వహించిన సమావేశంలో జగన్ పదే పదే ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కానీ.. వాస్తవం ఎలా ఉన్నా .. ఒక అగ్రపార్టీ నాయకుడిగా ఆయన నాలుగు గోడల మధ్యే ఉండడం.. అదే భ్రమలో బతికేయడం సరికాదని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు.
జగన్ మంచి చేసి ఉండొచ్చు.. ఇంతకన్నా మంచి చేస్తామన్న కూటమికి ప్రజలు పట్టం కట్టి ఉండొచ్చు. దీనిని జగన్ గుర్తించి.. ప్రజల మధ్యకు వస్తే.. ఆ రేంజ్ వేరేగా ఉంటుంది. ఇప్పటికి నాలుగు మాసాలు అయిపోయాయి. గతంలో చంద్రబాబును తీసుకుంటే.. ఆరు మాసాల సమయం ఇస్తున్నామని జగన్ సర్కారుకు తేల్చి చెప్పారు. కానీ, మూడు మాసాలకే ఆయన ప్రజల మధ్యకు వచ్చేశారు. ఇసుక విధానంపై పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఆయనే స్వయంగా విజయవాడలో ధర్నాలో కూర్చున్నారు.
దీంతో టీడీపీ ఓటమిపై సానుభూతి పవనాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగు మాసాలు గడిచిపోయాయి. కూటమి సర్కారుపై ఊహించుకున్నంత రేంజ్‌లో అయితే.. సానుకూలత కనిపించడం లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో తాడేపల్లిలోని నాలుగు గోడల మధ్య ఉండి ఏవో భ్రమల్లో బతికేస్తే.. ప్రజలకు స్వాంతన ఎలా చేకూరుతుందన్నది ప్రశ్న. కాబట్టి.. భ్రమలు కట్టిబెట్టి.. ప్రజల మధ్యకు వస్తేనే జగన్‌కు.. ఫ్యూచర్ ఉంటుందని చెబుతున్నారు. లేకపోతే.. ఆయన ఇక, ఎప్పటికీ అలానే ఉండిపోయే పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.