కుమార్తె చేత డిక్లరేషన్ ఇప్పించిన పవన్ కల్యాణ్

మాటలు చెప్పటంతోనే సరిపెట్టే రాజకీయనేతలు చాలామంది కనిపిస్తారు. రాజకీయ అధినేతలు సైతం ఇందుకు మినహాయింపుకాదు. కానీ.. తాను చెప్పేది ఏదైనా చేసి చూపిస్తానన్న విషయాన్ని జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆయన వెంట పెద్ద కుమార్తె ఆద్య తో పాటు చిన్న కుమార్తె పొలెనా అంజన కూడా వెళ్లారు.

అయితే.. పవన్ కుమార్తె పొలెనా అంజనా తల్లి క్రిస్టియన్ కావటంతో శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాల మీద సంతకాలు చేశారు. అయితే.. పొలెనా మైనర్ కావటంతో.. ఆమె తరఫున ఆమె తండ్రి పవన్ కల్యాణ్ డిక్లరేషన్ పత్రాల మీద సంతకాలు చేశారు.

అంతేకాదు.. దీనికి సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ సోషల్ మీడియా ఖాతాలోనూ పోస్టు చేశారు. ఇటీవల కాలంలో అన్యమతస్తులు శ్రీవారి దర్శనం వేళలో.. డిక్లరేషన్ ఇవ్వాలన్న అంశం తెర మీదకు రావటం.. దీనిపై వివాదం నెలకొనటం తెలిసిందే. అన్యమతస్తులు ఎవరైనా సరే.. శ్రీవారిని దర్శనం చేసుకునే ముందు.. డిక్లరేషన్ ఇవ్వటం మంచి సంప్రదాయంగా చెప్పే వేళ.. పవన్ కల్యాణ్ తన చిన్న కుమార్తె చేత డిక్లరేషన్ ఇవ్వటం ద్వారా మంచి సంప్రదాయాన్ని ఫాలో అయ్యారని చెప్పొచ్చు.

నిజానికి పితృస్వామ్య (ఇప్పుడు నడిచేది అనుకుంటే) వ్యవస్థలో తండ్రి కులం.. మతం మాత్రమే వారి బిడ్డలకు వస్తుంది. భర్త హిందువు అయి.. భార్య అన్యమతస్తురాలు అయినప్పటికీ వారికి పుట్టే సంతానాన్ని హిందువుగానే భావిస్తారు. ఒక వేళ మాతృస్వామ్య(ప్రపంచంలో దాదాపుగా ఇలాంటి వ్యవస్థ లేదనే చెప్పాలి) వ్యవస్థ ఉంటే.. తల్లి అన్యమతస్తురాలై.. తండ్రి హిందువుఅయితే.. వారి సంతానం అన్యమతానికి చెందిన వారుగా అవుతారు. అయితే.. ఎలాంటి వివాదానికి తావు లేకుండా.. ఏ ఒక్కరు వేలెత్తి చూపేందుకు అవకాశం ఇవ్వకుండా పవన్ తన చిన్న కుమార్తె తరఫు డిక్లరేషన్ ఇవ్వటం చూసినప్పుడు మాటలే కాదు చేతల్లోనూ తాను ఒకే పద్దతిని అనుసరిస్తానన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.