తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలు తెరమీదికి వచ్చిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
బుధవారం ఈ దీక్షను విరమించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చారు. అలిపిరి మెట్ల మార్గంలో ఆయన ఏడు కొండలు ఎక్కారు.
మంగళవారం రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను దీక్ష ఎందుకు చేపట్టిందీ వివరించారు. కేవలం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిందన్న ఒకే ఒక్క కారణానికి దీక్ష చేపట్టలేదన్నారు.
రాష్ట్రంలో ఆలయాల పరిస్థితి దుర్భరంగా ఉందని.. ఎక్కడేంచేసినా ఎవరూ అడగరనే రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించిందని.. అందుకే ఆలయాలపై దాడులు జరిగాయని తెలిపారు.
ఎక్కడో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలను ఛేదిస్తే.. ఎవరూ పట్టించు కోలేదన్నారు. అంతర్వేది రథాన్ని దగ్ధం చేశారని, విజయవాడ దుర్గమ్మ వెండి రథానికి ఉన్న బొమ్మలను కూడా దోచుకున్నార ని తెలిపారు.
అదేవిధంగా పవిత్రమైన తిరుమలలో అనమస్తుల జోక్యం పెరిగిందని చెప్పారు. ఈ కారణాలతో హిందూ ధర్మం, దేవాలయాలను పరరక్షించుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకే తాను దీక్ష చేపట్టానని పవన్ వివరించారు.
ఇక, తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపైనా పవన్ స్పందించారు. లడ్డులో వినియోగించిన నెయ్యి కల్తీ కాలేదని కానీ, అయిందని కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా ఏమీ చెప్పలేద న్నారు. అయితే.. నెయ్యికి సంబంధించి వచ్చిన ల్యాబు రిపోర్టులో తేడాలు ఉన్న విషయాన్ని మాత్రమే ప్రశ్నించిందన్నారు.
దీని పై విచారణ సాగుతోందని, కాబట్టి తానేమీ వ్యాఖ్యానించదలుచుకోలేదన్నారు. రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణకు శాశ్వత విధానం అంటూ ఒకటి కావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినట్టు పవన్ కల్యాణ్ వివరించారు.