కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యవహారం తీవ్ర ఉత్కంఠగా మారిపోయింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) భూముల కుంభకోణం కేసు ఆయన కుటుంబానికి చుట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సిద్దూ సతీమణి పార్వతి సహా బావమరిది మల్లికార్జున స్వామిపై కూడా కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన లోకాయుక్త కేసులను కొట్టి వేయాలని కోరుతూ.. సిద్దరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ కేసు తీవ్రత నేపథ్యంలో విచారణ జరిగి తీరాల్సిందేనని, కేసును కొట్టివేయడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో సిద్దూ విచారణకు రెడీ కాకతప్పలేదు.
ఇదిలావుంటే.. ఇదే కేసుకు సంబంధించి.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు. ఈ భూముల కుంభకోణానికి సంబంధించి భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని పేర్కొంటూ దీనిలో సీఎం సిద్దరామయ్యను ఏ1గా పేర్కొంటూ కేసు పెట్టారు. దీనికి లోకాయుక్త కూడా అనుమతి ఇచ్చింది. వాస్తవానికి లోకాయుక్త నమోదు చేసిన కేసు ఆధారంగానే ఈడీ ఇప్పుడు కేసు పెట్టడం గమనార్హం. దీంతో సీఎం సిద్దరామయ్యను అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటకలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చ సాగుతుండడం గమనార్హం.
ఇప్పటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రులను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ . ఈయన ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చి తన పదవికి రాజీనామా చేశారు. మరొకరు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్. కొన్నాళ్లపాటు జైల్లో ఉన్న ఆయన తర్వాత.. బయటకు వచ్చి మళ్లీ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కూడా కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ సర్కారు టార్గెట్ చేసిందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. దీనిపైనే సర్వత్రా చర్చ సాగుతోంది.
అసలేంటీ కేసు?
సీఎం సిద్దరామయ్య సతీమణి పార్వతికి వారసత్వంగా పసుపు కుంకాల కింద మైసూరులో సుమారు 200 ఎకరాల భూమి వచ్చింది. అయితే.. మైసూరు అర్బన్ డెవలప్ మెంటు అధారిటీ.. నగర అభివృద్ధిలో భాగంగా ఈ భూములను స్వాధీనం చేసుకుంది. ప్రత్యామ్నాయంగా మరోచోట భూములు కేటాయించారు. అయితే.. ఇవి తీసుకున్న భూముల ధరల కంటే కూడా రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. అప్పట్లో సిద్దరామయ్య సర్కారే ఉండడంతో ఉద్దేశ పూర్వకంగా తన సతీమణికి ఇలా భూములు కేటాయించుకున్నారని గవర్నర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేసింది.