ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు అనేక మంది నాయకులు ఎంతో కృషి చేశారు. కొందరు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. మరికొందరు కేసులు కూడా పెట్టించుకున్నారు. జైళ్లకు కూడా వెళ్లారు. ఇంకొందరు ఎన్నికల సమయంలో టికెట్లు త్యాగం చేశారు. ఇలాంటివారు వందల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
అయితే.. ఇప్పటికే 20కిపైగా నామినేటెడ్ పదవులను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. వీరిలో ఒకరిద్దరు జనసేన నాయకులు కూడా ఉన్నారు. కానీ, జాబితా చూస్తే మాత్రం వందల సంఖ్యలో ఉంది. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరితో మాట్లాడినా.. నామినేటెడ్ పదవుల విషయాన్ని ప్రస్తావిస్తుండడంతో చంద్రబాబుకు ఈ పరిస్తితి ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన ఈ వ్యవహారాన్ని మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు.
నిజానికి నామినేటెడ్ పదవుల విషయంపై సర్కారు ఏర్పడిన వెంటనే చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పార్టీ ఇంచార్జ్‌ల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు అందరికీ నామినేటెడ్ పదవుల విషయాన్ని ఆయన అప్పగించారు. జాబితాలు తెప్పించుకున్నారు. దానిలోనూ.. అనేక మందిని వడపోత ద్వారా ఎంపిక చేశారు. అయినా.. ఎక్కడో ఈ జాబితాల రూపకల్పనలోనే తేడా కొట్టినట్టు చంద్రబాబు గుర్తించారు. ఎందుకంటే.. వాస్తవంగా పార్టీ కోసం కష్టపడిన వారి కంటే కూడా.. ఇతర నాయకుల పేర్లు తెరమీదికి వచ్చాయి.
మరోవైపు.. కూటమి పార్టీల కు కూడా పదవులను పంచిపెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీకి కొంత మేరకు పదవులు తగ్గనున్నాయి. దీనిని గమనించిన చంద్రబాబు తనపై ఈ ప్రభావం పడకుండా ఉండేలా.. పూర్తిగా ఈ బాధ్యతలను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించేశారు. యువగళం పాదయాత్ర ద్వారా.. క్షేత్రస్థాయిలో నారా లోకేష్ పర్యటించిన నేపథ్యంలో ఎవరు పనిచేస్తున్నారు? ఎవరు పార్టీని డెవలప్ చేస్తున్నారనే విషయాలపై ఆయనకు అవగాహన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పదవుల వ్యవహారాన్ని నారా లోకేష్‌కు అప్పగించేశారు. దీంతో పదవుల విషయం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates