స్వర్ణాంధ్రప్రదేశ్@2047.. ప్ర‌జ‌ల సూచనలు కోరుతున్న బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు గొప్ప నిర్ణ‌యం తీసుకున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో రాష్ట్ర ప్రజలు కూడా భాగస్వాములు కావాల‌ని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర సాధనకు సూచనలు ఇవ్వమంటూ ప్ర‌జ‌ల‌కు బాబు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్టర్)‌లో ఆయ‌న‌ ట్వీట్ చేశారు.

‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీ వద్ద సూచనలు ఉన్నాయా..? అయితే మీరు ఇప్పుడు వాటిని నేరుగా ప్ర‌భుత్వంతో పంచుకోవచ్చు మరియు మీ సహకారానికి మెచ్చుకోలుగా ఇ-సర్టిఫికేట్‌ను అందుకోవచ్చు. 43 వేల డాలర్ల తలసరి ఆదాయంతో, 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది 2047 నాటికి దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే మా లక్ష్యం.

స్వర్ణాంధ్రప్రదేశ్ @ 2047 వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. ప్రకాశవంతమైన ఏపీని రూపొందించడానికి మేము మా తోటి పౌరుల నుండి సూచనలు ఆహ్వానిస్తున్నాము. ప్రతి వాయిస్ ముఖ్యమైనది మరియు ప్రతి సూచన గణించబడుతుంది. కలిసి మన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం.. మీ నుండి వినడానికి ఎదురుచూస్తున్నాము’ అంటూ చంద్ర‌బాబు త‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తూ ‘swarnandra.ap.gov.in’ అనే కొత్త‌ వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలను ఈ వెబ్‌సైట్ ద్వారా పంపాలని చంద్ర‌బాబు కోరారు. ప్రజలు అందించే సహకారానికి అభినందనగా ప్ర‌భుత్వం వారికి ఈ-సర్టిఫికెట్ జారీ చేస్తుంది.