జ‌గ‌న్‌కు ‘సంత‌కం’ స‌మ‌స్య‌.. ఓటు బ్యాంకు ఎఫెక్ట్‌!

తిరుమ‌ల ప‌ర్య‌ట‌న విష‌యంలో మాజీ సీఎం జ‌గ‌న్‌కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చింది. డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేసిన త‌ర్వాత శ్రీవారిని ద‌ర్శించుకోవాల‌న్న నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌డం ఆయ‌న‌కు ప్రాణ‌సంక‌టంగా మారిపోయింది. “నేను అన్య‌మ‌త‌స్థుడిని అయినా.. తిరుమ‌ల శ్రీవారిపై విశ్వాసం ఉంది” అని డిక్ల‌రేష‌న్ పై జ‌గ‌న్ సంత‌కం చేయాల్సి ఉంటుంది. ఈ సంత‌క‌మే ఇప్పుడు జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మారింది. దాని నుంచి త‌ప్పించుకునేందుకు ఏకంగా తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌నే జ‌గ‌న్ ర‌ద్దు చేసుకున్నారు.

సంత‌కం చేస్తే..

ఒక‌వేళ‌.. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వెళ్లి.. డిక్ల‌రేష‌న్‌పై క‌నుక జ‌గ‌న్ సంత‌కం చేస్తే.. రెండు కీల‌క విష‌యాలు వెలుగు చూస్తాయి. ఒక‌టి.. తాను హిందువును కాన‌ని ఆయ‌న స్వ‌యంగా ఒప్పుకొన్న‌ట్టు అవుతుంది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు.. జ‌గ‌న్ చ‌ర్చిల‌కు వెళ్లినా.. ప్రార్థ‌న‌లు చేసినా.. ఎక్క‌డా కూడా త‌న‌ను తాను క్రిస్టియ‌న్ అని ప్రొజెక్టు చేసుకోలేదు. అలాగ‌ని హిందువు కాద‌ని కూడా చెప్ప‌లేదు. ఇలాంటి స‌మయంలో ఇప్పుడు సంత‌కం చేస్తే.. ఆయ‌న హిందువు కాద‌న్న విష‌యాన్ని స్వ‌యంగా నిర్ధారించిన‌ట్టు అవుతుంది.

ఇక‌, రెండో విష‌యం.. ఓటు బ్యాంకు. ప్ర‌స్తుతం ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు జ‌గ‌న్‌కు సానుకూలంగానే ఉంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు 40 శాతం వ‌ర‌కు ఓట్లు రావ‌డానికి ఇదే కీల‌కం. ఎస్సీ, ఎస్టీల‌లో కూడా మెజారిటీ హిందువులే ఉన్నారు. ఇప్పుడు జ‌గ‌న్ క‌నుక హిందువు కాద‌ని స్వ‌యంగా ఒప్పుకొని సంతకం చేస్తే.. వీరి ఓటు బ్యాంకు వైసీపీకి దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే సాధార‌ణ హిందువులు చాలా వ‌ర‌కు వైసీపీకి దూర‌మ‌య్యారు.

తిరుమ‌ల ల‌డ్డూ అప‌విత్రం అయింద‌న్న వాద‌న నేప‌థ్యంలో హిందువులు వైసీపీని చీద‌రించుకుంటున్నారు. అందుకే కీల‌క నాయ‌కులు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలో తిరుమ‌ల డిక్ల‌రేష‌న్‌పై జ‌గ‌న్ సంత‌కం చేస్తే.. ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు కూడా క‌దిలి పోతుంద‌న్న భ‌యం జ‌గ‌న్‌ను వెంటాడుతోంది. అందుకే ఆయ‌న లౌక్యంగా శాంతి భ‌ద్ర‌త‌ల ప్ర‌స్తావ‌న‌తోపాటు.. ప్ర‌భుత్వం త‌న‌కు నోటీసులు ఇచ్చిందంటూ.. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారు.