వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. సాయిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారని అచ్చెన్న సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే అచ్చెన్నపై సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడుకు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% దేవుడు ఇచ్చాడంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. మోకాలికి, బోడి గుండుకు లంకె పెడుతుంటావంటూ అచ్చెన్నను సాయిరెడ్డి బాడీ షేమింగ్ కూడా చేశారు.
ఈ క్రమంలోనే సాయిరెడ్డి వ్యాఖ్యలకు అచ్చెన్న తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. నీలాగా ఆర్థిక దోపిడీ చేసే దుర్మార్గపు బుద్ధి, ఆర్థిక నేరాలకు సలహాలు ఇచ్చే దరిద్రపు బుద్ధి తమకు లేదని సాయిరెడ్డికి అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. పంచభూతాలను కబ్జా చేసే పరమ నికృష్టుడివి అని మండిపడ్డారు. వేరే వాళ్ళ గురించి విజయసాయి మాట్లాడే సంస్కారాన్ని బట్టి ఆయనకు చాలా తీవ్రమైన మానసిక సమస్య ఉందని అర్థమవుతోందని అచ్చెన్న దుయ్యబట్టారు. “కర్మ నీ దూల తీర్చే సమయం వచ్చింది… సుదీర్ఘకాలం జైలు జీవితానికి సిద్ధంగా ఉండు” అని విజయసాయిని అచ్చెన్న విమర్శించారు.
ప్రజలకు సేవ చేసే బుద్ధి తమకు ఇచ్చాడని అచ్చెన్న అన్నారు. చేసిన పాపాలకు శిక్ష తప్పదని వైసీపీ నుంచి టీడీపీలోకి వద్దామని విజయసాయి విశ్వప్రయత్నాలు చేశారని ఎద్దేవా చేశారు. కానీ, విజయసాయి వంటి నేరగాళ్లకు, ఆర్థిక ఉన్మాదులకు టీడీపీలో స్థానం లేదని, అందుకే దిక్కు తోచక పిచ్చి వాగుడు వాగుతున్నారని విజయసాయిని విమర్శించారు. విజయసాయి, జగన్ ఎన్ని వేషాలు వేసినా…వారి పాపం పండిందని, చేసిన ప్రతి తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates