నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలకు చెందిన ఆశావహులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని వర్గాలు, సామాజిక సమీకరణాలు పార్టీలు పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు నిన్న నామినేటెడ్ పదవుల కేటాయింపులను ప్రకటించారు. 99 మందికి నామినేటెడ్ పదవులు కేటాయించగా…20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు చంద్రబాబు. అయితే, తమకు పదవులు దక్కకపోవడంతో కొంతమంది ఆశావహులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే వారిని ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ముందుగా చెప్పినట్లు మూడు పార్టీల వారికి పదవులు ఇచ్చామని, కసరత్తు చేసి పదవులు ప్రకటించామని స్పష్టం చేశారు. ఫేజ్ 1లో ముందుగా కొందరికి పదవులు ఇవ్వగలిగామని, మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇంకా నామినేటెడ్ పోస్టులున్నాయని, లిస్టులు ఉన్నాయని, ఈ లోపు కొందరు నాయకులు తొందర పడుతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని, వేచి ఉండాలని చెప్పారు. టీడీపీలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తామని గుర్తు చేశారు.
కష్టపడిన వారికి మొదటి లిస్టులో అవకాశం దక్కిందని, దాని అర్థం మిగిలిన వారు పనిచేయలేదని కాదని చెప్పారు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన వాళ్లు, ఆస్తులు కోల్పొయిన వాళ్లు, కేసులు ఎదుర్కొన్న వారు, పార్టీకి ఎవరు ఎలా పనిచేశారన్న సమాచారం తన దగ్గరుందని అన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని, కష్టపడిన వారిని విస్మరించబోమని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించామని, జనాభా దామాషా లెక్కన బీసీలకు నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చామని చంద్రబాబు వివరించారు.
పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటులో ఏపీఐఐసీ పాత్ర కీలకమని, మౌలిక సదుపాయాల కల్పనతో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావచ్చని అన్నారు. చిన్న స్థాయి నేతలకు కూడా కార్పొరేషన్ లలో అవకాశాలు ఇచ్చామని, బాగా పనిచేస్తే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు. సింపుల్ గవర్నమెంట్… ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని నేను, పవన్ కళ్యాణ్ గారు చెప్పామని, అందరూ అదే పాటించాలని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates