ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఘోరంగా ఓడించిన సంగతి తెలిసిందే. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన వైసీపీ అధినేత జగన్…అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న తీరు ఆ పార్టీ నేతలకు కూడా మింగుడుపడడం లేదు. ఈ క్రమంలోనే మునిగిపోతున్న నావ వంటి వైసీపీ నుంచి బయట పడేందుకు చాలామంది నేతలు ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య పార్టీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా…పార్టీ కీలక నేత బాలినేని సహా సామినేని ఉదయ భాను వంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
ఈ క్రమంలోనే ఆ షాకుల నుంచి తేరుకోకముందే జగన్ కు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్ షాకిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు ఆయన పంపించారు. ముస్లింల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రశంసించారు. పాలనలో వైసీపీ అన్ని విధాలుగా విఫలమైందని విమర్శలు గుప్పించారు.
చివరకు ఎంసెట్ పరీక్షలను కూడా వైసీపీ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోయిందని, అందుకే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఓటు వేయలేదని అన్నారు. వైసీపీలో తాను ఇమడలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేశానని చెప్పారు. వైసీపీలో ఆది నుంచి రెహ్మాన్ చురుకుగా వ్యవహరించి ఉత్తరాంధ్రలో మంచి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే రెహ్మాన్ పార్టీని వీడటంతో ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇక, రెహ్మాన్ టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రెహ్మాన్ తో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ నేతలు, మద్దతుదారులు కూడా పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారట. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా పార్టీని నేతలు వీడుతున్న వ్యవహారానికి తోడు తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన అంశం తోడవడంతో జగన్ సతమతమవుతున్నారు.