తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కల్తీ వ్యవహారంపై వైసీపీ నేతల స్పందన ఆమోదయోగ్యంగా లేదని పవన్ విమర్శించారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని, అలా కాకుండా తమపై విమర్శలు చేయడం ఏమిటని పవన్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ పైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ నేతలు తప్పు చేసినట్టు నిరూపిస్తే, లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వాడినట్టు నిరూపిస్తే పవన్ కల్యాణ్ బూట్లు తాను తుడుస్తానని పవన్ కల్యాణ్ కు అంబటి సవాల్ విసిరారు. లడ్డూ విషయంలో పవన్ ఎందుకీ డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు తప్పు చేస్తే పవన్ మెట్లు తుడవడం ఏంటని సెటైర్లు వేశారు.
2014-19 మధ్య టీడీపీ హయాంలో విజయవాడలో ఎన్నో దేవాలయాలను పగలగొట్టారని, దేవతామూర్తుల విగ్రహాలను మున్సిపాలిటీ బండ్లపై వేసుకెళ్లారని గుర్తు చేశారు. సనాతన ధర్మంపై ఇంత ప్రేమ, భక్తి ఉన్న పవన్ అప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉన్నారని అంబటి ప్రశ్నించారు. వైసీపీ నేతలపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది తప్పు కాదా? దీన్ని భగవంతుడు క్షమిస్తాడా? అని ప్రశ్నించారు.
తిరుమలలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తే హైడ్రామా అని పవన్ విమర్శించారని, పవన్ మెట్లు తుడుస్తున్న వీడియో యాక్షన్ కట్ మాదిరి ఉందని సెటైర్లు వేశారు. మరి, అంబటి వ్యాఖ్యలపై పవన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? పవన్ విసిరిన సవాల్ ను అంబటి స్వీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates