ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అన్న సినిమా డైలాగ్ ఎంత పాపులర్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ మంత్రి నారా లోకేశ్ తనను తాను తగ్గించుకుంటున్న వైనం.. ఎక్కువ ఫోకస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వైనం చూస్తే.. లోకేశ్ మైండ్ సెట్ ముచ్చట వేస్తుందని చెప్పాలి.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా.. టీడీపీలో ఆయన స్థానం ఏ పాటిదన్న విషయాన్ని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్న వేళ.. కిందా మీదా పడుతూ పాదయాత్రను పూర్తి చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పడిన కష్టం.. శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చేతిలో అధికారం లేక.. అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ విసుగు చెందని తీరు లోకేశ్ లో కొట్టొచ్చినట్లు కనిపించేది. అంతేకాదు.. ప్రతికూల వాతావరణంలో ప్రతి ఇష్యూలోనూ తానే ఉన్నప్పటికీ.. తన పేరు కోసం తపించని వైనం లోకేశ్ అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి.
పార్టీ అధికారంలోకి రావటం.. పార్టీకి మిత్రులుగా ఓవైపు బీజేపీ.. మరోవైపు జనసేన ఉన్నప్పుడు.. తన ఎదుగుదల మీదా.. తనకు పెరగాల్సిన గౌరవ మర్యాదల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా.. అందరిలో ఒకడిగా ఉండటం అంత తేలికైన విషయంకాదు. తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ ఎంతగా ఫోకస్ అయ్యే వారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారన్న పేరు కేటీఆర్ కు ఉండేది. ఆ లెక్కన చూస్తే.. ఈ రోజున లోకేశ్ ఇమేజ్ మీద మరిన్ని ప్రాజెక్టులు చేయాల్సి ఉండేది. కానీ.. అలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా తాను చేయాల్సిన పనిని మాత్రం చేసుకుంటూ పోతున్నారు.
పని చేయటమే తప్పించి ఫలితం గురించి ఆలోచించకూడదన్నట్లుగా లోకేశ్ తీరు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. అధికారంలో మునిగి తేలుతూ కూడా.. అంతా తానై అన్నట్లు కనిపించాలన్న తపన లేకపోవటం ఒక ఎత్తు అయితే.. అలాంటి భావన ప్రజల్లోనూ లేకపోవటం కచ్చితంగా లోకేశ్ విజయంగా చెప్పక తప్పదు. ఇదంతా చూస్తున్నప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో అన్న విషయంపై లోకేశ్ కసరత్తు చేశారా? అన్న భావన కలుగక మానదు.