తొలిసారి వైఎస్ భారతిని టార్గెట్ చేసిన చంద్రబాబు

రాజకీయ అంశాల విషయానికి వస్తే.. ఎవరెన్ని అన్నా.. మరెంతగా విమర్శించినా టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గీత దాటి ముందుకు వెళ్లేందుకు సుతారం ఇష్టపడరు. రాజకీయంగా తన ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాల్ని సంధించే ఆయన.. వారి కుటుంబ సభ్యుల జోలికి వెళ్లరు. వారి గురించి మాట్లాడరు. అసలు అలాంటి ఆలోచనకు తావివ్వరు. అలాంటి చంద్రబాబు తొలిసారి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి మీద విమర్శలు చేయటం సంచలనంగా మారింది.

సీఎం చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని రీతిలో తన రాజకీయ ప్రత్యర్థి కుటుంబ సభ్యురాలి గురించి మాట్లాడారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి నాణ్యత మీద రాజుకున్న వివాదంలో తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు ధీటుగా బదులిచ్చే క్రమంలో.. అనూహ్యంగా వైఎస్ భారతి మీద విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగాఆయన కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.

  • తిరుమల సెట్ ను ఇంట్లో వేయించుకున్న జగన్ ను ఏమనాలి?
  • ఆయన సతీమణి గుడికి రారు.
  • జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో సతీసమేతంగా ఎప్పుడైనా శ్రీవారికి శేషవస్త్రాలు సమర్పించారా?
  • తిరుమలలో అసలు వీళ్లు ఏ సంప్రదాయాలు పాటించారు?
  • సుబ్బారెడ్డి వందసార్లు మాల వేసుకోని.. ఆయన భార్య బైబిల్ పట్టుకు తిరుగుతున్నారుగా?
  • ఆయనకు జగన్ సర్టిఫికేషనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ సతీమణి.. వైవీ సుబ్బారెడ్డి సతీమణి ఇద్దరూ హిందూమత ధర్మాన్ని పాటించరన్న అంశాన్ని చంద్రబాబు తాజా మీడియా భేటీలో ఓపెన్ గా వ్యాఖ్యానించారని చెప్పాలి. అదే సమయమలో తాను శ్రీ వేంకటేశ్వరస్వామికి ఎంత భక్తుడ్ని అన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయటం గమనార్హం.

“నేను వేంకటేశ్వరస్వామి భక్తుడ్ని.. ఆయన్ను తలచుకొనే ఏ పనైనా చేస్తాను. చిన్నప్పుడు శనివారం ఒక పొద్దు ఉండేవాళ్లం. నా చిన్నప్పుడు మా ఇంటి నుంచి తిరుమల కనిపించేది. అలాంటి ఆలయం విషయంలో నేను తప్పు మాట్లాడను. మనం నిమిత్తమాత్రులం. .ఆ ఏడుకొండలవాడే నాతో వాస్తవాలు చెప్పించారని అనుకుంటున్నా. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడుకొండలు కాదు రెండు కొండలు అన్నప్పుడు.. దాన్ని వ్యతిరేకించి పోరాడా” అంటూ తాను శ్రీవారికి ఎంతటి వీర భక్తుడ్ని అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.