గత ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమల లడ్డు నాణ్యత పడిపోయిందని.. లడ్డు తయారీలో వాడిన నెయ్యలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని కొత్త అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. తిరుమల శ్రీవారిని దేశవ్యాప్తంగా కోట్ల మంది కొలుస్తారు. ఇక్కడి లడ్డును పరమ పవిత్రంగా భావిస్తారు. దాని విషయంలో తప్పు జరిగిందనేసరికి భక్తులు తట్టుకోలేకపోతున్నారు.
ఈ విషయంలో వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ అధినేత జగన్ సహా ఎవరి వాదనా తర్కానికి నిలబడట్లేదు. ఈ వ్యవహారం వైసీపీకి పెద్ద డ్యామేజే చేసేలా కనిపిస్తోంది. వైసీపీ ఎంతగా వాదిస్తున్నా జనం ఆ పార్టీ వైపు లేకపోవడానికి, కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను నమ్ముతుండడానికి కారణం లేకపోలేదు. గత ఐదేళ్లలో జరిగిన అనేక పరిణామాలు అందుకు కారణం.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 50 ఏళ్ల నుంచి సరఫరా చేస్తున్న నాణ్యమైన నందిని నెయ్యి కాంట్రాక్టును ఆపేశారు. అది ప్రభుత్వ రంగ సంస్థ. లాభాల కోసం నాణ్యత విషయంలో రాజీ పడేందుకు ఆస్కారముండదు. అలాంటి సంస్థను ఉద్దేశపూర్వకంగా తప్పించడంతో కమిషన్ల కోసమే అన్న అభిప్రాయం అప్పుడే ఏర్పడింది. తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసిన ప్రైవేటు సంస్థ నాణ్యత విషయంలో రాజీ పడి ఉంటుందనే వాదన బలపడుతోంది.
ఇక తిరుమలలో వైసీపీ హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. నీళ్ల బాటిళ్ల ధరను 50 రూపాయలకు పెంచడం.. ఆర్జిత సేవల ధరలను విపరీతంగా పెంచడం.. దర్శన ఏర్పాట్లు అస్తవ్యస్తంగా మారడం, ఇతర సౌకర్యాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, శ్రీవారి ఆలయంలో జగన్ నినాదాలు చేయడం.. అన్యమతస్థులు పదవులు చేపట్టడం, అన్యమత ప్రచారం కూడా జరగడం.. ఇలా తిరుమలలో వివాదాస్పదమైన అంశాలు అన్నీ ఇన్నీ కావు. అన్నింటికీ మించి లడ్డు నాణ్యత తగ్గిందనే అభిప్రాయం గతంలోనే చాలామంది వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు ఈ విషయంలో ముందు నుంచే అభ్యంతరాలుండడంతో ఇప్పుడు వచ్చిన ఆరోపణలను నమ్మే పరిస్థితి వచ్చింది. ఇదే వైసీపీకి ప్రతికూలంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates