ఉద‌య‌భాను లెఫ్ట్‌.. వైసీపీకి కోలుకోలేని దెబ్బ‌!

వైసీపీకి కోలుకోలేని మ‌రో దెబ్బ త‌గిలింది. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఉద‌య భాను పార్టీ కి రాజీనామా చేశారు. జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న ఉద‌య‌భాను కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత స‌న్నిహిత నాయ‌కుడిగా ఆయ‌న మెలిగారు. త‌ర్వాత వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఈ పార్టీ టికెట్‌పై రెండు సార్లు పోటీ చేసిన ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో చోటు కోసం తీవ్రంగా శ్ర‌మించారు ఉద‌య‌భాను. కానీ, ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్క‌లేదు. రెండో సారి జ‌రిగిన మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో అయినా అవ‌కాశం ద‌క్కుతుంద‌ని భావించారు. కానీ, అప్పుడు కూడా అవ‌కాశం చిక్క‌లేదు. ఈ నేప‌థ్యంలో అప్ప‌టి నుంచి ఆయ‌న ముభావంగానే కొన‌సాగుతున్నారు. ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టికెట్ విష‌యం కూడా జ‌గ‌న్ ఇవ్వ‌కూడ‌ద‌ని భావించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అప్ప‌టి మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌గా ఉన్న వాసిరెడ్డి ప‌ద్మ‌కు జ‌గ్గ‌య్య పేట నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇస్తార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఈ వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూర్చింది. అయితే.. ఎట్ట‌కేల‌కు చివ‌రి నిముషంలో ఉద‌య‌భాను కు టికెట్ ఇచ్చారు. ఇక‌, కూట‌మి పార్టీల హ‌వాలో ఉద‌య భాను కూడా ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టినుంచి ఆయ‌న పార్టీకి, అధినేత జ‌గ‌న్‌కు కూడా దూరంగా ఉంటూ వ‌చ్చారు.

ఇదిలావుంటే..ఇప్పుడు ఉద‌య‌భాను పార్టీకి రాజీనామా చేశారు. ఆయ‌న కూడా బాలినేని శ్రీనివాస‌రెడ్డి త‌ర‌హాలోనే త్వ‌ర‌లోనే జ‌నసేన పార్టీలో చేర‌నున్నార‌ని స‌మాచారం. కాపు సామాజిక వ‌ర్గం కావ‌డం.. గ‌తంలో చిరంజీవితోనూ స‌న్నిహిత సంబంధాలు ఉన్న నేప‌థ్యంలో జ‌న‌సేన కూడా ఉద‌యభానుకు ఆహ్వానం పంపిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వ‌స్తున్న క‌థ‌నాల ప్ర‌కారం ఈ నెల 22న ఉద‌యభాను జ‌న‌సేన‌లో చేర‌నున్న‌ట్టు స‌మాచారం.