వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలను ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ‘గడపగడపకు మన ప్రభుత్వం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు పంపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, బటన్ నొక్కుడు ద్వారా అందుతున్న నగదు.. వంటి విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దీని వల్ల ఎన్నికల్లో మేలు జరుగుతుందని ఆశించారు. కానీ, ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే.
ఇక, ఇప్పుడు కూటమి పార్టీల ప్రభుత్వం కూడా ఇదే పని చేయనుంది. ఈ నెల 20(శుక్రవారం) నుంచి రా ష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల(టీడీపీ, జనసేన, బీజేపీ) ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రతి ఇంటికీ వెళ్లనున్నా రు. వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలను కలుసుకోనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో చేసిన మేళ్లను తీసుకున్న నిర్ణయాలను.. అమలు చేస్తున్న పథకాలను కూడా వివరించనున్నారు. ఇదేసమయంలో విపక్షం వైసీపీ నిర్లక్ష్యం గురించి కూడా ప్రచారం చేయనున్నారు.
కూటమి సర్కారు వంద రోజులు పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చేసింది చెప్పుకోలేక పోతే.. ఆగమై పోతామన్న భావనను వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనలో తొలి నాడే 7 వేల పింఛను ఇచ్చిన విషయాన్ని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న తీరును కూడా ప్రజలకు వివరించనున్నారు.
ఈ క్రమంలో వంద రోజుల్లో సర్కారుకు ఎదురైన సవాళ్లను, వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నదీ కూడానాయకులు ప్రజలకు వివరించనున్నారు. వంద రోజుల పాలనపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగా పాలనలో మార్పులు చేసుకోవాలన్న ది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉంది. మార్పులు సహజంగా జరగకపోతే.. ఇబ్బందులు తప్పవన్నది కూడా ఆయన మాటే. ఈ నేపథ్యంలోనే గడపగడపకు కూటమి సర్కారు పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల20న ప్రారంభించనున్నారు. మరి ఏమేరకు ప్రజలు తమ అభిప్రాయం చెబుతారనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates