ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపారు. ఈ నూతన మద్యం విధానంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దీని ప్రకారం.. ఇక నుంచి మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న విధానం మేరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అనుమతి ఉంది.
కానీ, ఇప్పుడు మరో గంట సమయాన్ని పొడిగించారు. ఇది రాత్రివేళ(నైట్) పనులు చేసుకుని ఉదయం ఇంటికి చేరుకునే కార్మికుల కోసం తీసుకువచ్చిన వెసులుబాటుగా సర్కారు పేర్కొంది.
ఇక, అన్నీ నాణ్యమైన బ్రాండ్లనే అందుబాటులో ఉంచనున్నారు. దీని ప్రకారం సాధారణ మద్యం ప్రారంభ ధర రూ.99 నుంచి మొదలవుతుంది. అయితే.. నాణ్యమైన బ్రాండ్ల ధరలు కంపెనీలు.. ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయిస్తాయి. రాష్ట్రంలో కల్లుగీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులను రిజర్వ్ చేశారు.
ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే వాటిని కేటాయించనున్నారు. ఈ డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉండడం గమనార్హం. అయితే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఇక, దీనివల్ల కల్లుగీత కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందన్నారు.
వైసీపీ హయాంలో కొన్ని రకాల మద్యమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు కూటమి సర్కారు అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో లైసెన్సులు మంజూరు చేస్తారు. ఇవి రెండేళ్లపాటు ఉంటాయి.
దీనికిగాను తిరిగి చెల్లించని విధానంలో సర్కారు వారు 2 లక్షల రూపాయలను దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. లక్కీ డ్రా పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. వ్యాపారంలో యజమానికి 20 శాతం లాభం వచ్చేలా మద్యం పాలసీని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల మంది జనాభాకు ఒక దుకాణాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఏపీలో 12 ప్రీమియర్ లిక్కర్ షాపులను ఏర్పాటు చేయనున్నారు.