కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పదే పదే చెబుతున్న జమిలి ఎన్నికలకు తాజాగా మరింత ముందడుగు పడింది. జమిలి ఎన్నికలకు తాజాగా జరిగిన మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం జై కొట్టింది. దీనికి సంబంధించిన చర్చకు ఓకే చెప్పింది.
జమిలి ఎన్నికలను ముక్తకంఠంతో కేంద్ర కేబినెట్ స్వాగతించింది. “వన్ నేషన్-వన్ ఎలక్షన్” నినాదాన్ని అందిపుచ్చుకుంది. ప్రధాని గత ఆగస్టు 15న ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో జమిలి ప్రస్తావన తీసుకువచ్చారు. తమ టెర్మ్(ఈ పాలనలో)లోనే జమిలిని నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
అప్పటికే జమిలి ఎన్నికలపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం, జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించడం లక్ష్యంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేస్తూ.. నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించింది.
మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమొదం తెలిపింది. 191 రోజుల సుదీర్ఘ అధ్యయనం తర్వాత…రాష్ట్రపతికి 18,626 పేజీల నివేదికను అందించిన విషయం తెలిసింది. ఈ నివేదికను రాష్ట్రపతి భవన్.. కేంద్ర హోం శాఖకు ఇటీవల పంపించింది.
దీనిపై తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మోడీ సహా మంత్రులు ఆమోదం తెలిపారు. అయితే.. ఈ సిఫారసుల్లో జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని ఐదు అధికరణల సవరణ ఆవశ్యం ఉందని పేర్కొన్నారు. ఆర్టికల్ 324A, 325 ప్రకారం ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి.
జమిలి ఎన్నికల నిర్వహణకు రెండంచల విధానం అమలు చేయాలని సిఫారసు చేశారు. మొదట లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. మొదటి దశ పూర్తయిన వంద రోజుల్లోపు… రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఏదైనా కారణంతో పార్లమెంట్ లేక అసెంబ్లీ నిర్ధారిత కాలపరిమితికన్నా ముందే రద్దు అయితే… మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలని మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. అదేవిధంగా అభ్యర్థులు మరణించినా.. ఇతర కారణాలతో ఎన్నికలు ఆగిపోయినా.. మిగిలిన కాలానికే ఆయా స్థానాలకు(అవి ఏవైనా కూడా) ఎన్నికలు నిర్వహించాలని కమిటీ స్పష్టం చేసింది. కాగా.. దీనిపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్రాల అసెంబ్లీలోనూ తీర్మానం ఆమోదించాల్సి ఉంటుంది. అయితే.. కీలకమైన కేంద్ర కేబినెట్ మాత్రం తాజాగా అంగీకారం తెలపడం గమనార్హం.